Ugadi ఉగాదికి లక్ష్యాలు పూర్తిచేయాలి
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:33 PM
Targets Must Be Achieved by Ugadi రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి నిర్దేశించిన లక్ష్యాలను పంచాయతీ రాజ్ , హౌసింగ్ సిబ్బంది పూర్తి చేయాలని పాలకొండ పంచాయతీ రాజ్ శాఖ ఈఈ జి.రవి ఆదేశించారు.
కురుపాం, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి నిర్దేశించిన లక్ష్యాలను పంచాయతీ రాజ్ , హౌసింగ్ సిబ్బంది పూర్తి చేయాలని పాలకొండ పంచాయతీ రాజ్ శాఖ ఈఈ జి.రవి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కురుపాం ఎంపీడీవో కార్యాలయంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో 38 గిరిశిఖర గ్రామాల్లో రహదారులు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 52.48 కోట్లు మంజూరు చేసిందన్నారు. అందులో గుమ్మలక్ష్మీపురంలో 24 రోడ్లు, కురుపాంలో 14 , జియ్యమ్మవలస మండలంలో ఒక రోడ్డు నిర్మించాల్సి ఉందని వెల్లడించారు. ఉగాది నాటికి అన్ని రహదారుల నిర్మాణం పూర్తిచేసి.. ప్రారంభోత్సవం చేయాలని ఆదేశించారు. కురుపాంలో 543, జియ్యమ్మవలస 255, గుమ్మలక్ష్మీపురం మండలంలో 280 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఇంజనీంగ్, టెక్నికల్ అసిస్టెంట్, ఏఈఈలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ డీఈఈ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఉమామహేశ్వరి, మూడు మండలాల ఏఈలు, ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.