లక్ష్యం 4,320.. జరిగినవి 443
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:20 AM
‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి.
- ఇదీ పీహెచ్‌సీల్లో ప్రసవాల పరిస్థితి
- గర్భిణులను ఏరియా, జిల్లా కేంద్ర
ఆస్పత్రులకు రెఫరల్ చేస్తున్న వైనం
రాజాం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించాలి. ఈ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలి. ప్రభుత్వం అందించే రాయితీలు పొందాలి. క్షేమంగా తల్లీబిడ్డలు ఇంటికి చేరాలి’. ఇది ఉన్నతాధికారుల నుంచి పీహెచ్‌సీల వైద్యుల వరకూ చెప్పే మాట. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందడం లేదు. ప్రసవాలు జరగడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు వైద్యం వైపే చూస్తున్నారు. జిల్లాలో గత ఏడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల లక్ష్యం 4,320 కాగా కేవలం 443 మాత్రమే జరిగాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 3,330 లక్ష్యంకాగా.. జరిగినవి 1,261. విజయనగరంతో పోల్చుకుంటే మన్యం ఈ విషయంలో ముందంజలో ఉంది.
ఇదీ పరిస్థితి..
విజయనగరం జిల్లాలో 50 పీహెచ్‌సీలు ఉన్నాయి. 113 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. మన్యంలో 37 పీహెచ్‌సీలకుగాను 83 మంది వైద్యులు పనిచేస్తున్నారు. పీహెచ్‌సీల పరిధిలో వైద్య పరీక్షలు, చికిత్స, టీకాలు, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందులు అందించడం వీరి ప్రధాన విధి. ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరిపి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు అందించాలి. మాతా శిశుసంరక్షణ, కుటుంబ నియంత్రణ అన్నవి పీహెచ్‌సీల ప్రధాన విధులు. అంతకు మించి అత్యవసర సేవలను సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రులు చూస్తాయి. అయితే పీహెచ్‌సీలు అనేవి ఉత్సవ విగ్రహాలుగా మిగులుతున్నాయి. కనీసం అక్కడ ప్రాథమిక వైద్యం చేయించుకునేందుకు సైతం ప్రజలు ఇష్టపడడం లేదంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
పేద కుటుంబాలపై భారం..
పేద కుటుంబాల్లో ప్రసవం అంటే రూ.50 వేల వరకూ ఖర్చు అవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో పీజుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలతో పాటు ఉచిత వైద్యసేవలు అందే వెసులుబాటు ఉంది. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండరు. వైద్యపరికరాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది విముఖత చూపుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకూ జిల్లాలో ఉన్న పీహెచ్‌సీల్లో నెలకు ఒక ప్రసవం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్కడకు ప్రసవాలకు వెళ్లి వారిలో అధిక మందిని వివిధ కారణాలు చెప్పి సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రులకు రెఫరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు వెళ్తుండగా మార్గమధ్యలో ప్రసవిస్తున్న వారూ ఉన్నారు. చాలాచోట్ల మాతా శిశు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అందుకే పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
ఆదేశాలిచ్చాం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కేవలం హైరిస్క్ కేసులను మాత్రమే ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రులకు రిఫర్ చేయాలని సూచించాం. ఈ ఏడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో లక్ష్యం మేరకు ప్రసవాలు జరిగేలా చూస్తాం.
-జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం