Share News

వచ్చే ఏడాది ‘తారకరామ’ సాగునీరు

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:29 PM

తారకరామ తీర్థ సాగర్‌ ప్రాజెక్టు నుంచి వచ్చే ఏడాది నుంచి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని, ఇంకా మిగిలి ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని జేసీ సేతుమాధవన్‌ సూచించారు.

  వచ్చే ఏడాది ‘తారకరామ’ సాగునీరు
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌

- పెండింగ్‌ భూసేకరణ వెంటనే పూర్తి చేయాలి

- జేసీ సేతుమాధవన్‌

విజయనగరం, కలెక్టరేట్‌ సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): తారకరామ తీర్థ సాగర్‌ ప్రాజెక్టు నుంచి వచ్చే ఏడాది నుంచి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని, ఇంకా మిగిలి ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని జేసీ సేతుమాధవన్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తోటపల్లి బ్యారేజీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విజయనగరం -సంబల్‌పూర్‌ మూడో రైల్వే లైన్‌ పనులు, కొత్తవలస, విజయనగరం నాలుగో లైన్‌, ఖుర్ధారోడ్‌ -విజయనగరం నాలుగో లైన్‌కు సంబంధించి భూసేకరణపై సమీక్షించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పూసపాటిరేగ మండలం జి.చోడవరం, టాయ్‌ పార్కు, బొండపల్లి అంబటివలస, గరివిడి, గజపతినరం మరుపల్లి, ఎస్‌.కోట శ్రీరాంపురం, మల్లివీడు ఇంటిగ్రేడ్‌ స్టీల్‌ ప్లాండ్‌, కొత్తవలస ఇన్ర్పావెంచర్‌, బాడంగి ఆకులకట్టఫుడ్‌ పార్క్‌, రేగిడి ఆమదాలవలస, గొల్లపాడు ఎంఎస్‌ఎంఈ పార్కులకు సంబంధించి భూసేకరణఫై ఆరా తీశారు. భూయజమానులకు చట్ట ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో సత్తిబాబు, సర్వే శాఖ ఏడీ సత్తిబాబు, ఏడీ విజయకుమార్‌, ఆర్డీవోలు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

22ఏ దరఖాస్తులపై జాప్యం వద్దు..

జిల్లాలో 22ఏకి వచ్చిన దరఖాస్తులు పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని జేసీ సేతుమాధవన్‌ ఆదేశించారు. మంగళవారం రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌లో జిల్లా వ్యాప్తంగా 983 గ్రామాలకు సంబంధించిన పనుల్లో స్కానింగ్‌ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:29 PM