Share News

Tanks have disappeared. చెరువులు మాయం

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:57 PM

Tanks have disappeared. గంట్యాడ మండలంలోని మదనాపురం గ్రామ పరిధిలో సర్వే నెంబరు 5లో నీలకంఠరాజు చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో మూడు నుంచి నాలుగు ఎకరాలు మినహా మిగిలిన చెరువు గర్భం ఆక్రమణకు గురైంది.

Tanks have disappeared. చెరువులు మాయం
గంట్యాడ మండలంలోని ఆక్రమణకు గురైన మదనాపురం నీలకంఠరాజు చెరువు

చెరువులు మాయం

జిల్లా అంతటా ఆక్రమణలు

రియల్‌ ఎస్టేట్లలో కలిపేసుకుంటున్న వైనాలు

పెద్ద ఎత్తున అధికారులకు ఫిర్యాదులు

కాగితాలపైనే పరిష్కారం

క్షేత్రస్థాయిలో కానరాని మార్పులు

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి):

- గంట్యాడ మండలంలోని మదనాపురం గ్రామ పరిధిలో సర్వే నెంబరు 5లో నీలకంఠరాజు చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో మూడు నుంచి నాలుగు ఎకరాలు మినహా మిగిలిన చెరువు గర్భం ఆక్రమణకు గురైంది. ఇరిగేషన్‌ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఈ చెరువు ఉంది. రెవెన్యూ డివిజన్‌ అధికారి చెరువు ఆక్రమణను గుర్తించినా చర్యలు లేవు. మరోవైపు చెరువు అక్రమణపై స్థానికులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్య మాత్రం యథావిధిగానే ఉంది.

- ఎస్‌.కోట మండల పరిధిలో కిల్తంపాలెం గ్రామ పరిధిలో సర్వే నెంబరు 22లో ఉన్న ఎర్ర చెరువు, సర్వే నెంబరు 97లో ఉన్న బొర్లండి చెరువు, సర్వే నెంబరు 153లోని మొగలాయి బంద, సర్వే నెంబరు 87లో ఉన్న పిల్లివాని చెరువు, సర్వే నెంబరు 97లోని అమర్ల బందతోపాటు మరో మూడు చెరువులు ఆక్రమణకు గురైనట్లు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నిర్వహించిన ప్రజా దర్బారులో కె.గౌరి నాయుడు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు లేవు.

జిల్లాలో ఈ రెండు చోట్లే కాదు ప్రతి మండలంలోనూ ఈ పరిస్థితి ఉంది. తక్కువ.. ఎక్కువ అనేదే చెప్పుకోవాలి. అనేక చెరువులు అక్రమణకు గురి అవుతున్నాయి. వాటిపై ఫిర్యాదులు వస్తున్నా సమగ్ర చర్యలు ఉండడం లేదు. చెరువు గర్భాలు ఇష్టాసారంగా అక్రమించి, నిర్మాణాలు చేపట్టడం, చదును చేసి వివిధ పంటలు సాగు చేయడం, రహదారులు నిర్మించడం, లేఅవుట్లు వేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దగా చర్యలు లేకపోవడంతో ఆక్రమణదారులు తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో కూడా ప్రభుత్వ భూములు, చెరువు గర్భాల ఆక్రమణలపైనే ఎక్కువ అర్జీలు అందుతున్నాయి.

జిల్లాలో 2024 జూన్‌ 15 నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 1437 అర్జీలు పీజీఆర్‌ఎస్‌లో అందాయి. వీటిలో 1,123 వినతులు పరిష్కరించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడువు లోపు 1098 వినతులు పరిష్కారం కాగా గడువు దాటాక 25 పరిష్కరించి నట్లు అధికారులు చెబుతున్నారు. రీ ఓపెన్‌ అయినవి 107 వినతులు ఉండగా 105 పరిష్కారమయ్యాయని, పెండింగ్‌లో 2 ఉన్నాయంటున్నారు. మొత్తంగా 207 వినతులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే అధికారులు చెబుతున్న వాటికి, అక్కడి పరిస్థితికి పొంతన ఉండడం లేదు. కాగితాలపై తప్పా క్షేత్రస్థాయిలో పరిష్కారం కావడం లేదని అర్జీదారులు గగ్గోలు పెడుతున్నారు.

హైడ్రా ప్రస్తావన

ఎస్‌.కోట మండలంలో చెరువుల ఆక్రమణలు ఎక్కువగా ఉంటున్నాయంటూ ఎంఎల్‌సి ఇందుకూరి రఘరాజు ఇటీవల జరిగిన డీఆర్‌సీలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మరో ప్రజాప్రతినిధి స్పందిస్తూ తెలంగాణ తరహాలో ఇక్కడ కూడా హ్రైడాను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

Updated Date - Aug 29 , 2026 | 11:57 PM