Talks successful..! చర్చలు సఫలం..!
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:25 AM
Talks successful..! జిందాల్ భూ నిర్వాసిత రైతులు, యాజమాన్యంకు మధ్య నడుస్తున్న వివాదానికి చెక్ పడింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో నిర్వాసిత రైతులు, వారి తరుపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
చర్చలు సఫలం..!
జిందాల్ భూ నిర్వాసిత పోరాటానికి చెక్ పెట్టిన ప్రభుత్వం
రైతుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన హోంమంత్రి అనిత
అనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రఘురాజు
సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
శృంగవరపుకోట, జూన్ 30 (ఆంధ్రజ్యోతి):
జిందాల్ భూ నిర్వాసిత రైతులు, యాజమాన్యంకు మధ్య నడుస్తున్న వివాదానికి చెక్ పడింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో నిర్వాసిత రైతులు, వారి తరుపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, నిర్వాసిత రైతులకు మద్దతుగా నిలిచిన రైతు సంఘం నాయకుడు చల్లా జగన్, జిందాల్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తరుపున మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. దీర్ఘకాలిక సమస్యలన్నింటిపైనా మాట్లాడారు. ప్రధాన అంఽశాలన్నింటినీ ఆమె ఓపిగ్గా విన్నారు. పరిష్కారం చూపేందుకు వున్న అవకాశాలను అక్కడే వున్న ఆర్డీవో సుధాసాగర్‌ను, శృంగవరపుకోట తహసీల్దార్ డి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. వారిచ్చిన సమాచారం బట్టి నిర్వాసిత రైతులు వెళ్లబుచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాటన్నింటినీ నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.
శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, మూలబొడ్డవర, ముషిడిపల్లి, చినఖండేపల్లి, చీడిపాలెం గ్రామాల పరిధిలో జిందాల్ యాజమాన్యం కోసం సేకరించి ఇచ్చిన భూముల విషయంలో ఏడాది కాలంగా నిర్వాసిత రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్కుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈనెల 3న కడప నుంచి వర్చువల్‌గా సీఎం నారా చంద్రబాబునాయుడు భూమి పూజ చేసేందుకు పరిశ్రమ యాజమాన్యం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈనేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌లు జిందాల్ భూనిర్వాసిత రైతుల న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపాలని సూచించడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చొరవ చూపారు.
సానుకూల నిర్ణయాలివీ..
ఇప్పటి వరకు షేర్‌ల అమౌంట్ పొందని 82 మంది రైతులకు ఆ సొమ్ము విడుదల చేయనున్నాను. నిర్వాసిత ప్రతి రైతు కుటుంబంలోని ఒకరికి ఉపాధి అవకాశం కల్పించనున్నారు. నివాసాలు కోల్పోయిన బందవలస గ్రామానికి చెందిన వారికి మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించనున్నారు. భూములను కోల్పోయిన రైతులకు భూసేకరణలో ఇచ్చిన మొత్తంతో సంబంధం లేకుండా అదనంగా ఎకరాకు రూ. 2.50 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు. చీడిపాలెం గ్రామంలో ఐదుగురురికి పరిహారం మంజూరు విషయంలో సానుకూలంగా స్పందించారు. 18 మంది పీఓటీ రైతుల వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
ఫ మూలబొడ్డవర గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన రైతులకు డి.పట్టాలను ఇచ్చేందుకు అసైన్డ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. రైతులు అడిగిన సమస్యల్లో కీలకమైన అనేక వాటికి పరిష్కారం దొరకడంతో నిర్వాసిత రైతులు అనందం వ్యక్తం చేశారు. హోం శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ద్వారా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్న సీఎం నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మా పోరాటం ఫలించింది
జిందాల్ భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగింది. దీన్ని సరిదిద్దేందుకు పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం నిర్వాసిత రైతుల అవేదనను అర్థం చేసుకుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ద్వారా న్యాయం చేయడంతో మా పోరాటం ఫలించినట్లయింది. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.2.50 లక్షలు అదనంగా పరిహారం ఇస్తామన్నారు. ఈనెల 13నాటికి చెక్కులు అందిస్తామని మాట ఇచ్చారు. మాతో కలిసి పోరాటం చేసిన నిర్వాసిత రైతులతో పాటు మిగిలిన రైతులకు కూడా లబ్ధి చేకూరుతుంది. ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించేందుకు అంగీకరించడం అనందంగా ఉంది.
ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్సీ