Share News

పనులు చేపట్టి.. కష్టాలు తీర్చి

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:41 PM

జిల్లాలోని పలు దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంతెనలు, అనేక రహదారుల నిర్మాణం పూర్తయింది.

పనులు చేపట్టి.. కష్టాలు తీర్చి
రూ.41 కోట్లతో నిర్మించిన మక్కువ-అజ్జాడ రహదారి

-దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం

- జిల్లాలో పలు వంతెనలు, రోడ్ల నిర్మాణం పూర్తి

- 5న ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి ప్రారంభోత్సవం

పార్వతీపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంతెనలు, అనేక రహదారుల నిర్మాణం పూర్తయింది. వీటిని ఈ నెల 5న ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం మండల కేం ద్రంలోని బ్రిటిష్‌ కాలం నాటి వంతెన శిథిలం కావడంతో ప్రజలు, వాహనచోదకులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. గత వైసీపీ ప్రభుత్వంలో నూతన వంతెన పనులను ప్రారంభించారు. అప్పట్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో వంతెన నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ మధ్యలో నిలిపివేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 కోట్లు మంజూరు చేయడంతో వంతెన పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. అదే విధంగా మక్కువ-అజ్జాడ రోడ్డు కూడా పూర్తయింది. ఎన్నోఏళ్లుగా ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాహనచోదకులు ఐదేళ్ల పాటు నరకం చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.41 కోట్లు విడుదల చేయడంతో పనులు పూర్తయ్యాయి. అలాగే, బలిజిపేట మండలం పనుకువలస నుంచి కొత్తపల్లి వరకు రూ.1.50కోట్లతో కొత్త రహదారిని నిర్మించారు. బొబ్బిలి నుంచి అరసాడ వరకు రహదారి నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేశారు. ఈ నెల 5న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. పూర్తి చేసిన వంతెన, రోడ్లను ప్రారంభించడంతో పాటు బొబ్బిలి-అరసాడ రహదారి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 11:41 PM