జల సంరక్షణే లక్ష్యంగా పనులు చేపట్టండి
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:25 AM
జల సంరక్షణే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కోరారు.
11111111111111111111
సాలూరు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): జల సంరక్షణే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కోరారు. సోమవారం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, సాగునీటి వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ద్వితీయ శ్రేణి నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ వందరోజుల్లో సాగునీటి పనులను గుర్తించడం, నిధులు మంజూరు చేయడం, పనులను వేగంగా పూర్తిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రైతులకు సమయానికి సాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సంవత్సరానికి గానూ నియోజకవర్గానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 490 కోట్లు మంజూరైనట్టు వివరించారు. గిరిశిఖర గ్రామాలకు తాగునీటి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు. అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. కొందరు పనితీరు మార్చుకోవాలని సూచించారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాల యంలో నిర్వహించిన సమావేశానికి మెంటాడ తహసీల్దార్, ఎంపీడీవో హాజరుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు హాజరుకాక పోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. విజయనగరం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ఉందని, అందుకే హాజరు కాలేదని సిబ్బంది తెలియజేయగా రాష్ట్ర మంత్రి సమావేశం కంటే వీడియో కాన్ఫరెన్స్ ఎక్కువైందా అని ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ రామచంద్రరావుకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ, సాలూరు పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, గుళ్ల వేణుగోపాలనాయుడు, గూడెపు యుగంధర్, ఆముదాల పరమేశు, చనమల్లు వెంకటరమణ తో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.