ఉక్కపోత.. బిల్లుల మోత
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:17 AM
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు శీతకన్ను వేశాయి. అంతేకాకుండా వాతావరణంలో తేమశాతం పెరుగుతుండడంతో గాలి వీయడం లేదు. దీంతో ఇంట బయట ఒక్కటే ఉక్కబోత. ఇటు కార్యాలయాలు, వర్తక వాణిజ్య సముదాయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జూన్ నుంచి నేటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవటం ప్రధాన సమస్యగా మారింది. ఈ ప్రభావంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది.
ఉక్కపోత.. బిల్లుల మోత
ఎల్‌నినో ప్రభావంతో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
ఇళ్లతో పాటు వాణిజ్య రంగంలోనూ ఇదే పరిస్థితి
వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం
విజయనగరం/రింగురోడ్డు, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు శీతకన్ను వేశాయి. అంతేకాకుండా వాతావరణంలో తేమశాతం పెరుగుతుండడంతో గాలి వీయడం లేదు. దీంతో ఇంట బయట ఒక్కటే ఉక్కబోత. ఇటు కార్యాలయాలు, వర్తక వాణిజ్య సముదాయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జూన్ నుంచి నేటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవటం ప్రధాన సమస్యగా మారింది. ఈ ప్రభావంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది.
గడిచిన మూడు నెలల్లో ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరై విద్యుత్ వినియోగాన్ని పెంచారు. సామాన్య మానవుడి నుంచి, ఉన్నత కుటుంబీకుల వరకు రేయింబవళ్లూ ఏసీ, కూలర్, ఫ్యాన్‌లకు అతుక్కుపోతున్నారు. జూన్, జూలైలో వరుణుడు కరుణించక పోవటంతో వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. నారుమడులు, మెట్టపంటలు, వాణిజ్య పంటలను కాపాడుకోవడం కోసం విద్యుత్ మోటార్ల వినియోగం పెరిగింది. ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వినియోగానికి సరిపడావిద్యుత్ సరఫరా లేక తరచూ అధిక వినియోగ ఒత్తిడితో ట్రాన్‌ఫార్మర్లు ట్రిప్ అవుతున్నాయి. ఇటు ప్రజలకు, అటు విద్యుత్ సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఉన్న గృహాల్లో ఇబ్బందులు వర్ణణాతీతం.
గడిచిన మూడు నెలల్లో గరిష్ఠంగా 37 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లాలో విఽధ్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో బిల్లులు షాక్ కొడుతున్నాయి.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో 7లక్షలకు పైగా విధ్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ, వాణిజ్య, వ్యవసాయ, ఇతర విద్యుత్ కనెక్షన్లు కలుపుకుని 7లక్షల 27వేల 575 వరకు ఉన్నాయి
గృహ కనెక్షన్లు 6లక్షల 4వేల 405
వాణిజ్య కనెక్షన్లు (కేటగిరి-2) 67, 323
వాణిజ్య కనెక్షన్లు (కేటగిరి-3) 2,532
వ్యవసాయ కనెక్షన్లు (కేటగిరి-4) 14,460
పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు (హెచ్‌టీ కేటగిరి-5) 38,817
రెండేళ్లలో విద్యుత్ వినియోగం ఇలా..
2025జూన్‌లో 277.018 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా 2026 జూన్‌లో 304.824 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. అంటే ఈ ఏడాది 127.806 మిలియన్ యూనిట్లు అదనంగా వినియోగించారు.
2025 జూలైలో 151.472 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా 2026 జూలై (18వరకు) 173.36 మిలియన్ యూనిట్ల విద్యుత్ విఽనియోగం జరిగింది. ఇప్పటి వరకు 22.564 మిలియన్ యూనిట్లు అదనపు వినియోగించారు. మిగిలిన పది రోజుల్లో వినియోగంతో కలిపితే భారీగానే తేడా రావొచ్చు.
అంతరాయం లేకుండా సరఫరా: ఎం.లక్ష్మణరావు, ఎస్‌ఈ, విజయనగరం
జిల్లాలో ఈ ఏడాది ఎండత్రీవత, ఉక్కబోత వల్ల వినియోగదారులు విద్యుత్‌ను గణనీయంగా వినియోగిస్తున్నా.. ఎక్కడా అంతరాయం లేకుండా డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. అధిక వినియోగంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడుతోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బందితో పర్యవేక్షిస్తూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.