Share News

Swearing-in ceremony like a festivalపండగలా ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:51 PM

Swearing-in ceremony like a festival జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక, ప్రమాణ స్వీకారం పండగలా సాగింది. జిల్లా పరిషత్‌ ప్రాంగణమంతా శుక్రవారం కోలాహలం నెలకొంది. జడ్పీటీసీలు, వారి కుటుంబీకులు, బంధువులు, అభిమానులతో ఒకటే సందడి కనిపించింది.

Swearing-in ceremony like a festivalపండగలా ప్రమాణ స్వీకారం
జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు సిరి సహస్రకు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

పండగలా ప్రమాణ స్వీకారం

జడ్పీ చైర్‌పర్సన్‌గా సిరిసహస్ర

వైస్‌ చైర్‌పర్సన్‌గా పాశల నీరజ ప్రమాణం

మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరు

సభను బహిష్కరించిన వైసీపీ జడ్పీటీసీలు

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక, ప్రమాణ స్వీకారం పండగలా సాగింది. జిల్లా పరిషత్‌ ప్రాంగణమంతా శుక్రవారం కోలాహలం నెలకొంది. జడ్పీటీసీలు, వారి కుటుంబీకులు, బంధువులు, అభిమానులతో ఒకటే సందడి కనిపించింది. జడ్పీ చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర, వైస్‌ చైర్‌పర్సన్‌గా పాశల నీరజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముందుగా కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులకు కలెక్టర్‌ రామసుందర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరితో ప్రమాణం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ల ప్రమాణస్వీకారం జరిగింది.

విజయనగరం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ విభజన తర్వాత కొలువుదీరిన కొత్త పాలకవర్గం రాకతో జడ్పీ కొత్త శోభను సంతరించుకుంది. ప్రమాణస్వీకారోత్సవానికి అతిరథులంతా రావడంతో సందడే సందడి నెలకొంది. సెప్టెంబరు 24తో గత పాలక వర్గం పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి కలెక్టర్‌ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఈ క్రమంలో అంతా అధికారులే తప్పా.. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కనిపించలేదు. శుక్రవారం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారంతో మళ్లీ సందడి, పూర్వవైభవం సంతరించుకుంది. ప్రమాణ స్వీకారంలో భాగంగా జడ్పీ సీఈవో పి.కిరణ్‌కుమార్‌ వరుసగా సభ్యుల పేర్లను పిలవగా, వారి చేత కలెక్టర్‌ ప్రమాణం చేయించారు. ఈ ఘట్టం పూర్తయిన వెంటనే వైసీపీ జడ్పీటీసీ సభ్యులు ఐదుగురు, ఎమ్మెల్సీ డాక్టర్‌ సూర్యనారాయణరాజుతో కలిసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, జిల్లా స్థానిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు తేజ్‌ భరత్‌ పర్యవేక్షణలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నిక జరిగింది. ముందుగా కోరం తనిఖీ చేశారు. మొత్తం 27 మంది సభ్యులకు గాను, 22 మంది హాజరు కావడంతో ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. చైర్మన్‌ పదవికి మజ్జి సిరి సహస్ర పేరును రాజాం జడ్పీటీసీ సభ్యురాలు చీడి రూపవతి ప్రతిపాదించగా, ఎస్‌.కోట జడ్పీటీసీ డోకుల సునీత బలపరిచారు. అలాగే వైస్‌ చైర్‌పర్సన్‌ పదవికి పాశల నీరజ పేరును దత్తిరాజేరు జడ్పీటీసీ మిత్తిరెడ్డి వెంకటరామ సింహాచలం ప్రతిపాదించగా, వంగర జడ్పీటీసీ మజ్జి గణపతి బలపరిచారు. రెండు పదవులకు ఇతరులెవరూ నామినేషన్లు వేయకపోవడంతో రెండు స్థానాలూ ఏకగ్రీవమైనట్లు కలెక్టర్‌ ప్రకటించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ బాధ్యతలను స్వీకరిస్తూ వారు ప్రతిజ్ఞ చేశారు.

- జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 20 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఐదు స్థానాల్లో, జనసేన రెండింటిలో నెగ్గింది. చైర్‌ పర్సన్‌గా ఎన్నికైనా మజ్జి సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ కాగా, వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పాశల నీరజ బొండపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్‌సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు కమిడి కళావెంకటరావు, కోళ్ల లలితకుమారి, బేబీనాయన, రాష్ట్ర తూర్పుకాపు చైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి, జడ్పీ మాజీ చైర్మన్‌ శ్రీనివాసరావు తదితరులు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇద్దరూ జిల్లా అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని అవి పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.

- జడ్పీ చైర్‌పర్సన్‌ మజ్జి సిరిసహస్ర మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తానని అన్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు. సీనియర్‌ ప్రజాప్రతినిధుల సలహాలను స్వీకరించి, ప్రజలకు మంచి పరిపాలనను అందించేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు.

---------------------

విద్య, వైద్యంపై దృష్టిసారిస్తా

కూటమి నేతల సమన్వయంతో ముందుకు వెళ్తాను

గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పనే లక్ష్యం

‘ఆంధ్రజ్యోతి’తో జడ్పీ చైర్‌పర్సన్‌ మజ్జి సిరిసహస్ర

విజయనగరం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి):

‘జిల్లాపై స్పష్టమైన అవగాహన ఉంది. విద్య, వైద్యంపై దృష్టిసారిస్తాను. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాను’ అని కొత్త జడ్పీ చైర్‌పర్సన్‌ మజ్జి సిరిసహస్ర అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం శుక్రవారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పరిపాలనలో తన ప్రాధాన్యాలను వివరించారు.

ప్ర: చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు ఎలా చూడగలరు?

జ: చిన్నశ్రీను సోల్జ్‌ర్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలు, సమస్యలను తెలుసుకున్నాను. పుట్టినిల్లు- మెట్టినిల్లు రెండూ ఈ జిల్లాయే కావడంతో విజయనగరంపై పూర్తి అవగాహన ఉంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తాను.

ప్ర : పాలనలో ఏ విధంగా ముందుకెళ్తారు?

జ : బీటెక్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. పరిపాలన విషయంలో నాయకులను, అధికారులను సమన్వయం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటాను. ప్రత్యేక సందర్భాల్లో సీనియర్ల సలహాలు పాటిస్తాను. వివాద రహిత పాలన అందిస్తాను.

ప్ర : జడ్పీలో ఏళ్లతరబడి బదిలీలు లేవంటున్నారు? మీరేం చేస్తారు?

జ: సమగ్ర సమాచారం తెప్పించుకుని సరైన సమయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. తొలుత ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్య లేకుండా చూస్తాను.

ప్ర : మౌలిక సదుపాయాల సంగతేంటి?

జ: పరిపాలనలో మౌలిక సదుపాయాల కల్పనే నా తొలిప్రాధాన్యం. పాఠశాలల విషయంలో విద్యార్థులకు సమస్యలు లేకుండా చర్యలు చేపడతాం. డివిజన్ల వారీగా సమాచారం తెప్పించుకుని అందుకనుగుణంగా ముందుకు వెళ్తా.

Updated Date - Nov 20 , 2026 | 11:51 PM