Swachh Ratham స్వచ్ఛ రథం.. లక్ష్యానికి దూరం!
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:43 PM
Swachh Ratham Falls Short of Its Goal! జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతే లక్ష్యంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన స్వచ్ఛ రథాల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ కొరవడడంతో కొన్ని మండలాలకు చెందిన వాహన ఆపరేటర్లు సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
వ్యర్థాల సేకరణ అంతంతమాత్రమే..
కొరవడిన పర్యవేక్షణ.. స్వచ్ఛత లక్ష్యానికి తూట్లు
పార్వతీపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతే లక్ష్యంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన స్వచ్ఛ రథాల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ కొరవడడంతో కొన్ని మండలాలకు చెందిన వాహన ఆపరేటర్లు సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. పారిశుధ్యం మెరుగులో భాగంగా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జిల్లాలో 14 మండలాల్లో స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. ఆ వాహనాల కోసం మండల పరిషత్ నుంచి రూ.50 వేల చొప్పున నిర్వాహకులకు ఇచ్చారు. ప్రతినెలా వ్యర్థాల సేకరణ సక్రమంగా ఉంటే వారికి రూ.20 వేలు ఇస్తారు. ఇందులో రూ.2 వేలు మండల పరిషత్‌కు తిరిగి చెల్లించాల్సి ఉంది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ , కాగితం, గాజు వ్యర్థాలు , ఇనుప తదితర వస్తువులను స్వచ్ఛరథాల ఆపరేటర్లు స్వీకరించి .. వాటికి వెలకట్టి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందించాల్సి ఉంది. మరోవైపు వ్యర్థాలను పునర్వినియోగానికి అందించేలా చర్యలు చేపట్టాలి. అయితే లక్ష్యం మంచిదేనా.. కొన్ని పంచాయతీల్లో స్వచ్ఛ రథాలు కదలడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా జిల్లాలోని 451 పంచాయతీలకు గాను 218 పంచాయతీల్లో స్వచ్ఛ రథాలు తిరుగు తున్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 218 పంచాయతీల్లో ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు స్వచ్ఛరథం వాహనాల ద్వారా పేపర్లు, మెటల్ వస్తువులు తదితర వాటిని స్వీకరించామని అధికారులు చెబుతున్నారు. పేపర్ వ్యర్థాలు 29,513 కేజీలు, ప్లాస్టిక్ 39,689 కేజీలు, మెటల్ వస్తువులు 25,013 కేజీలతో పాటు అద్దం పరికరాలు 15,72 కేజీలు, ఈ-వేస్ట్ వ్యర్థాలు 83 కేజీలు, ఇతర సామగ్రి 79 కేజీల వరకు స్వీకరించినట్లు వెల్లడిస్తున్నారు. మొత్తంగా 1,10,101 కేజీల (110.101 టన్నులు) వ్యర్థాలు సేకరించి.. స్వచ్ఛ రథం వాహనాల ద్వారా ప్రజలకు నిత్యావస సరుకులు అందించామని చెబు తున్నారు. కానీ అనేక పంచాయతీల్లో ఆ రథాలు తిరిగిన దాఖలాలు లేవని గ్రామస్థులు ఆరోపి స్తున్నారు. ఇటీవల సీతానగరం మండలంలో ఎంపీడీవోతో పాటు డిప్యూటీ ఎంపీడీవో కూడా స్వచ్ఛ రథం పనితీరుపై ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి.. తగు చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంతవాసులు కోరుతున్నారు.
జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ
జీపీఎస్ ద్వారా స్వచ్ఛ రథాల పర్యవేక్షణ త్వరలోనే ప్రారంభమవుతుంది. వాటి పనితీరుపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి మండలంలో ఎంపీడీవోల పర్యవేక్షణలో స్వచ్ఛ రథాల ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరే విధంగా వారు పని చేయాలి.
- రవీంద్ర, జిల్లా పంచాయతీ అధికారి, పార్వతీపురం మన్యం