reservations రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠ
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:39 PM
Suspense over finalization of reservations జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలో ‘స్థానిక’ సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. ఈనెల 22న వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎవరికి వారే ప్రచారంలో నిమగ్నం
క్షేత్రస్థాయిలో వేడెక్కిన రాజకీయం
కూటమి పార్టీలకు సవాల్‌గా మారనున్న స్థానిక ఎన్నికలు
పార్వతీపురం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలో ‘స్థానిక’ సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. ఈనెల 22న వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా వార్డుల పునర్విభజనతో పార్వతీపురం, సాలూరుతో పాటు పాలకొండలో పరిస్థితి మారింది. గతంతో పోలిస్తే.. ఒక ప్రాంతంలో ఓటర్లు కొత్త వార్డుల్లోకి వెళ్లే అవకాశముంది. దీంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే రిజర్వేషన్లు ఖరారు కాకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయం మాత్రం వేడెక్కింది. అన్ని పార్టీల అభ్యర్థులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీల్లోని వార్డుల్లో ఎవరికి వారు ప్రచారాలు చేసుకుం టున్నారు. కొందరు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు పార్టీల అధిష్ఠానం ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అన్నిచోట్లా ఆశావహులు అధిక సంఖ్యలో ఉండడంతో కూటమి పార్టీలకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం పురపాలక సంఘంలో ఎన్నికల వేడి ఎక్కువగానే ఉంది. ప్రధానంగా కూటమి పార్టీల నుంచి బరిలో దిగేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే తాము లేదా కుటుంబ సభ్యులను, లేకుంటే నమ్మకమైన వ్యక్తులను బరిలోకి దించేందుకు ఆశావహులు వ్యూహరచన చేస్తున్నారు. కాగా పార్వతీపురం పురపాలక సంఘం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ కొంతమంది నాయకులు చైర్‌పర్సన్ కుర్చీ బీసీ సామాజిక వర్గానికి ఖరారు అవుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఎవరికి వారు రిజర్వేషన్ల ఖరారుపై ప్రచా రాలు చేస్తున్నారు. అదే విధంగా వార్డుల రిజర్వేషన్‌పై కూడా స్పష్టత లేనప్పటికీ కొన్ని వార్డులకు చెందిన కూటమి నాయకులు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఐక్యత కొనసాగేనా...
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రాజకీయ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య ఐక్య ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికి వారే చైర్మన్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
సాలూరు మున్సిపాలిటీలోనూ ఎంతోమంది పురపోరుకు సిద్ధమవు తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు ఎవరికి వారు వ్యూహ రచనలతో ముందుకు సాగుతున్నారు. వార్డుల పునర్విభజన నేపథ్యంలో తాజాగా రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటున్నారు. కొందరు పక్క వార్డులపై దృష్టి సారిస్తున్నారు. సరిహద్దులను చూసుకుంటూ.. కొత్తగా కలిసిన ప్రాంతా లను తెలుసుకుంటున్నారు. ఓటర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు.
పాలకొండ నగర పంచాయతీలో స్థానిక ఎన్నికలు కూటమి పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. ఇక్కడ కూటమి నేతల మధ్య ఐక్యతా రాగం అంతంత మాత్రంగానే ఉంది. జనసేన, టీడీపీ నుంచి పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు.
తేలనున్న ఓటు బ్యాంకు ..
ప్రస్తుతం చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరి ఓటు బ్యాంకు ఏమిటో తేలనుంది. మెజార్టీ ఏ మేరకు వస్తుందన్నది కూడా స్పష్టం కానుంది. కాగా సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో పాజిటివ్ ఓటు పెరగాలని కూటమి నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల బాధ్యత మరింత పెరిగింది. ఒకవేళ మెజార్టీ తగ్గితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభావం పడే అవకాశం ఉంది. ఏదేమైనా కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయంతో పాటు మెజార్టీ సాధించడమే లక్ష్యంగా కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి.. పాజిటివ్ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.