BC Reservations బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:50 PM
Suspense Over BC Reservations స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా బీసీల రిజర్వేషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే.
పార్వతీపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా బీసీల రిజర్వేషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండ కూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దీనిపై కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తర్వాతే ప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారుపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
జిల్లాలో 451 పంచాయతీలు, ఒక నగర పంచాయతీ, రెండు పురపాలక సంఘాలు ఉన్నాయి. వాటిల్లో వివిధ పదవులకు రిజర్వేషన్లు ఖరారు కావాలంటే న్యాయస్థానం తీర్పు తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంది. అప్పుడే ఏ సామాజిక వర్గానికి ఎంత రిజర్వేషన్ ఖరారైంది, ఏ పంచాయతీ, పురపాలక సంఘం ఏ సామాజిక వర్గానికి ఖరారు అయిందనే దానిపై స్పష్టత వస్తుంది. అయితే ఈ తీర్పు ఎప్పుడొస్తుందా? అని వివిధ పదవుల కోసం పోటీ చేయాలనుకునే బీసీ సామాజిక వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కాగా బీసీలకు కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచినప్పటికీ .. కొంతమంది హైకోర్టుకు వెళ్లడంపై ఆ సామాజిక వర్గాలకు చెందిన వారు తప్పుబడుతున్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలంటే రిజర్వేషన్ల పెంపు ఎంతో అవసర మని వారు చెబుతున్నారు. ఏదేమైనా సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.