Surveys నత్తనడకన సర్వేలు
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:40 AM
Surveys Moving at a Snail’s Pace జిల్లాలో పలు సర్వేలు ముందుకు సాగడం లేదు. సకాలంలో నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా.. పరిస్థితి మారడం లేదు. కొన్ని సచివాలయాల పరిధిలో సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం
ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా మారని వైనం
గరుగుబిల్లి, మార్చి1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు సర్వేలు ముందుకు సాగడం లేదు. సకాలంలో నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా.. పరిస్థితి మారడం లేదు. కొన్ని సచివాలయాల పరిధిలో సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా జిల్లాలోని 350 సచివాలయాల పరిధిలో అక్షర ఆంధ్ర, యూనిఫైడ్ ప్యామిలీ, సిటిజన్ ఈకేవైసీ సర్వేలు నిర్వహించాలని సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఎంపీడీవోలకు, డిప్యూటీ ఎంపీడీవోలకు ఉన్నతాధి కారులు సూచించారు. అయితే క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి నెలకొంది.
- ప్రస్తుతం జిల్లాలో అక్షర ఆంధ్ర సర్వే ఒక్కటే పూర్తయింది. దీనికి సంబంధించి సచివాలయాల పరిధిలో 6,714 మంది వలంటీర్లను ఎంపిక చేయాలని, 67,111 మందిని అక్షరాస్యులుగా మార్చాలని టార్గెట్ విధించారు. అయితే లక్ష్యానికి మించి.. 6,728 మంది వలంటీర్లను ఎంపిక చేసి.. 67,708 మంది నిరక్షరాస్యుల సమాచారాన్ని సేకరించారు.
- యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని గత నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇందుకోసం 2,960 మందిని నియమించారు. అయితే 2,732 మంది సర్వేలో పాల్గొనగా, మరో 161 మంది పాల్గొనడం లేదు. దీంతో ఈ సర్వే నత్తనడకన సాగుతుంది. జిల్లాలో 2,97,305 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 2,26,985 కుటుంబాల వివరాలు సేకరించారు. ఇంకా 70 వేల కుటుంబాల వివరాలను సేకరించాల్సి ఉంది. పూర్తిస్థాయి సమాచారాన్ని ఆన్‌లైన్ పొందుపర్చాల్సి ఉంది. ఈ సర్వే ఆధారంగానే జూన్ నెలలో కుటుంబ సభ్యులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను అందించే ప్రయత్నంలో ఉంది. గతనెల 25న ఈ సర్వేను పూర్తిచేయాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించినట్లు తెలిసింది.
- ఇక సిటిజన్ ఈకేవైసీ సర్వేలోనూ జిల్లా వెనుకంజలో ఉంది. ఆధార్ నమోదు చేసుకోలేని వారు, రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానం కాని వారు సరుకులు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని రేషన్‌కార్డులకు సంబంధించి ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ 50 శాతానికి మించలేదు. జిల్లాలో 86,244 మందికి గాను 42,964 మందికి సిటిజన్ ఈకేవైసీ నిర్వహించారు. మరో 37,586 మందికి ఈ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. ఇదిలా ఉండగా జాబితిలో ఉన్న వారిలో 5,204 మంది మృతి చెందారు. పీ-4 సర్వేలోనూ సిబ్బంది వెను కంజలో ఉన్నారు. వరుస సర్వేల కారణంగా కొన్ని ప్రాంతాల్లో సచివాలయాల సిబ్బంది తమకు నచ్చిన విధంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎంపీడీవో జి.పైడితల్లిని వివరణ కోరగా.. ‘ నిబంధనల మేరకు సకాలంలో సర్వేలు పూర్తి చేయాల్సిందే. దీనిపై సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాం. సర్వేలో వెను కంజలో ఉన్నవారిపై చర్యలు తప్పవు. సిబ్బంది ఒత్తిడికి గురికాకుండా ఉండేలా వెసులబాటు కల్పిస్తున్నాం.’ అని తెలిపారు.