Share News

Approval సర్వే సరే.. మంజూరు ఎప్పుడు?

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:48 PM

Survey Done... But When Will Approval Come? జిల్లాలో అర్హులైన పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం ఏడాది కిందట పీఎంఏవై-జీ 2-0 పథకంలో భాగంగా సర్వే చేపట్టారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించారు. అయితే నేటికీ ఇళ్లు మంజూరు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 Approval  సర్వే సరే.. మంజూరు ఎప్పుడు?

  • అప్ప‌ట్లో జిల్లా అంతటా గ్రామసభలు

  • ఇళ్ల మంజూరుపై కొరవడిన స్పష్టత

  • ఆశగా ఎదురుచూస్తున్న అర్హులు

పార్వతీపురం, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం ఏడాది కిందట పీఎంఏవై-జీ 2-0 పథకంలో భాగంగా సర్వే చేపట్టారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించారు. అయితే నేటికీ ఇళ్లు మంజూరు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ (పీఎంఏవై-జీ) 2-0 పథకంలో భాగంగా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సర్వే చేపట్టింది. జిల్లా అంతటా అధికారులు గ్రామసభలు కూడా నిర్వహించారు. అప్పట్లో గుమ్మలక్ష్మీపురం మండలంలో 3,724 మంది, కురుపాంలో 2,268, భామినిలో 1,929 , కొమరాడలో 2,196, సీతంపేటలో 2,060, జియ్యమ్మవలసలో 2,655 మంది చొప్పున అర్హులుగా గుర్తించారు. అదేవిధంగా వీరఘట్టం మండ లంలో 2,652 మంది, సీతానగరంలో 1,888, పార్వతీపురంలో 1753, గరుగుబిల్లిలో 1278, పాలకొండలో 2,354 , పాచిపెంటలో 1380, బలిజిపేటలో 1483, సాలూరులో 1833 , మక్కువలో 1872 మందిని అర్హులుగా గుర్తించారు. అయితే సర్వే నిర్వహించి ఏడాది పూర్తవుతుండగా.. కొద్ది నెలల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఇళ్లు మంజూరు చేయకపోవడంతో గ్రామీణ ప్రజలకు ఏం చెప్పాలో తెలియక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా సుమారు 31వేల మంది ఇళ్ల మంజూరు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

- జగనన్న కాలనీల పేరిట గత వైసీపీ సర్కారు పార్టీ కార్యకర్తలు, వారి మద్దతుదారులకే అధికంగా ఇళ్లు మంజూరు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా గత ప్రభుత్వ పాలనలో ఎంతోమంది అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. మరికొందరు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోగా.. మరికొందరు స్థోమత లేక పనులను మధ్యలోనే నిలిపేశారు. మరోవైపు బిల్లులు కూడా మంజూరు కాకపోవడంతో చాలామంది గృహ నిర్మాణాలను చేపట్టలేకపోయారు. ఇటువంటి వారంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.

- ఇదిలా ఉండగా గృహ నిర్మాణశాఖలో కొన్నేళ్లుగా జిల్లా మేనేజర్‌ పోస్టు ఖాళీగానే ఉంది. గత వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఇన్‌చార్జిల పాలనతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్లర్లు కూడా పూర్తిస్థాయిలో లేరు. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతోంది. ఇళ్ల మంజూరుపై ప్రజలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

త్వరలో మంజూరు

జిల్లాలో పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో సుమారు పది వేల ఇళ్లు మంజూరయ్యాయి. త్వరలో అర్హులకు కేటాయిస్తాం. గిరిజన ప్రాంతాల్లో పీఎం జన్‌మన్‌ కింద మంజూరైన ఇళ్లకు బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి.

- ధర్మరాజు, జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇన్‌చార్జి మేనేజర్‌

Updated Date - Aug 02 , 2026 | 11:48 PM