Timber Smuggling Thrives! నిద్దరోతున్న నిఘా .. దర్జాగా కలప దందా!
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:09 PM
Surveillance Asleep, Timber Smuggling Thrives! సీతంపేట ఏజెన్సీలో కలప అక్రమ దందా జోరుగా సాగుతోంది. విలువైన అటవీ సంపదను యథేచ్ఛగా తరలిస్తున్నా.. సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా పొల్ల, మానాపురం, దోనుబాయి, కడగండి, గుడ్డిమీదగూడ, ఓండ్రుజోల, చిన్నబగ్గ, మర్రిపాడు, పూతికవలస, కోడిశ, శంభాం, కుసిమి తదితర గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో టేకు, గుగ్గిలం, మామిడి, ఇరిడి చెట్లను నరికి దుంగలుగా మారుస్తున్నారు.
విలువైన అటవీ సంపదకు రక్షణ కరువు
చోద్యం చూస్తున్న అటవీశాఖ
సీతంపేట, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో కలప అక్రమ దందా జోరుగా సాగుతోంది. విలువైన అటవీ సంపదను యథేచ్ఛగా తరలిస్తున్నా.. సంబంధిత శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా పొల్ల, మానాపురం, దోనుబాయి, కడగండి, గుడ్డిమీదగూడ, ఓండ్రుజోల, చిన్నబగ్గ, మర్రిపాడు, పూతికవలస, కోడిశ, శంభాం, కుసిమి తదితర గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో టేకు, గుగ్గిలం, మామిడి, ఇరిడి చెట్లను నరికి దుంగలుగా మారుస్తున్నారు. రాత్రి సమయాల్లో వాటిని వాహనాల్లో లోడుచేసుకుని సరిహద్దు గ్రామాల మీదుగా తరలిస్తున్నారు. కొన్నిచోట్ల గిరిజన రైతుల నుంచి వ్యాపారులు కారుచౌకగా కలపను కొనుగోలు చేసి అడ్డదారుల్లో మైదాన ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారి గుండా పట్టపగలే కలప వ్యాపారులు టేకుదుంగలను తరలిస్తున్నా.. ప్రశ్నించే వారే కరువయ్యారు. గతంలో పాలకొండ పట్టణంలోని ఏలాం సెంటర్‌లో ఉన్న అటవీశాఖ కార్యాలయంలో చెక్‌పోస్టును నిర్వహించేవారు. కొన్నేళ్ల కిందట దానిని ఎత్తివేశారు. దీంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. పాలకొండ-హడ్డుబంగి మార్గంలో పాల కొండలోని అటవీశాఖ కార్యాలయం మీదుగానే కలపను అక్రమంగా తరలిస్తున్నారు. దీని నియం త్రణకు అటవీశాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.
వాల్టా చట్టానికి తూట్లు
వాల్టా చట్టం నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా చెట్లను నరకరాదు. ఒకవేళ నరికితే ఆ చెట్టు స్థానంలో రెండు లేక అంతకంటే ఎక్కువ మొక్కలను నాటి సంరక్షించాల్సి ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారికి రూ.వెయ్యి నుంచి రూ.5వేలు అంతకంటే ఎక్కువ అపరాధ రుసుము విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడుతుంది. అయితే సీతంపేట మన్యంలో మా త్రం వాల్టా చట్టం అమలు కావడం లేదు.
ఎఫ్‌ఎస్‌వో ఏమన్నారంటే..
‘ఏజెన్సీలో కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం. ముందస్తు సమాచారం మేరకు దాడులు కూడా నిర్వహిస్తున్నాం. అక్రమ కలప రవాణా అవుతున్న మార్గాల్లో ఆయా బీట్ అధికారులను అప్రమత్తం చేశాం.’ అని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ తెలిపారు.