Share News

Supporting Tribal గిరిజనులను ఆదుకునేలా..

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:42 PM

Supporting Tribal Communities గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రద్దయిన జీవో నెంబర్‌-3పై ప్రభుత్వం దృష్టి సారించింది. గిరిజనులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ జీవో తెచ్చేందుకు అడుగులు వేస్తోంది.

 Supporting Tribal గిరిజనులను ఆదుకునేలా..

  • వైసీపీ హయాంలో జీవో నెంబర్‌-3 రద్దు

  • ప్రత్యామ్నాయ జీవో వైపు కూటమి అడుగులు

పార్వతీపురం, జూలై21(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రద్దయిన జీవో నెంబర్‌-3పై ప్రభుత్వం దృష్టి సారించింది. గిరిజనులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ జీవో తెచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆ శాఖ కార్యదర్శి ఎంఎం.నాయక్‌, డైరెక్టర్‌ సదా భార్గవితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2020లో సుప్రీంకోర్టు జీవో నెంబర్‌ 3ని రద్దు చేయడం, దానిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయక పోవడం తదితర అంశాలపై చర్చించారు. గిరిజనులకు భవిష్యత్‌లో ఎటువంటి న్యాయ చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ జీవోను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగానే మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ నెల 22న గిరిజన ఎమ్మెల్యేలతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని అమరావతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే గిరిజన సంఘాల నాయకులతో పాటు ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి మంగళవారం అమరావతి బయల్దేరి వెళ్లారు. గిరిజనులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే విధంగా బుధవారం జరిగే సమావేశంలో వారంతా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ జీవోపై ఒక నిర్ణయానికి వచ్చే అవ కాశం ఉంది. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనా ఎన్నికల సమయంలో కురుపాం సభలో ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం చర్యలు తీసుకోవడంతో సర్రత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానిక ఆదివాసీలకే దక్కేలా రూపొందించిన జీవో నెంబర్‌ 3ని పునరుద్ధరించాలని కొన్నాళ్లుగా గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దృష్టి సారించింది. ఈ మేరకు గతంలో పార్వతీపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సదా భార్గవి గిరిజన సంఘాల ప్రతినిధులతో సమావేవవ నిర్వహించారు. 2000లో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌-3 స్థానంలో ప్రత్యామ్నాయ జీవో తేవడం , తదితర అంశాలపై గిరిజన సంఘాల అభిప్రాయాలను సేకరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు గిరిబిడ్డలకు భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నారని మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి తెలిపారు.

Updated Date - Jul 21 , 2026 | 11:42 PM