వినియోగదారులకు అండగా..
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:31 PM
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ‘వినియోగదారుల క్లినిక్’కు విశేష స్పందన లభిస్తోంది.
-జిల్లాకేంద్రంలో ‘కన్జ్యూమర్ క్లినిక్’కు విశేష స్పందన
-రాష్ట్రంలోనే తొలిసారిగా మన్యంలో ఏర్పాటు
-త్వరలో మండల, గ్రామస్థాయిలో ..
పార్వతీపురం, ఏప్రిల్9(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ‘వినియోగదారుల క్లినిక్’కు విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి దీనిని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై ఇక్కడ అర్జీలు ఇచ్చారు. వస్తువుల కొనుగోలులో మోసపోయినా లేదా సేవల్లో లోపాలు ఉన్నా... నకిలీ, నాణ్యతలేని వస్తువులు, అధిక ధరలతో నష్టపోయిన వినియోగ దారులకు ఈ క్లినిక్ ఒక పరిష్కార వేదిక మారనుంది. ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా కలెక్టరేట్‌లోని వినియోగదారుల క్లినిక్‌లో ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను అధికారులు తీసుకోనున్నారు. జిల్లా కేంద్రంలో ప్రారంభించిన ఈ క్లినిక్‌ను రానున్న రోజుల్లో మండల, గ్రామస్థాయిల్లో ఏర్పాటుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అన్ని ప్రాంతాల్లో వినియోగ దారుల సంఘాలను ఏర్పాటు చేసి వాటిని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొం దిస్తోంది. వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు. కాగా ఇప్పటికే రెవెన్యూ, లీగల్ క్లినిక్‌లతో మన్యం జిల్లా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. తాజాగా కలెక్టర్ చొరవతో వినియోగ దారుల క్లినిక్‌తో ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ‘వినియోగదారులకు అండగా ఉండేందుకు రాష్ట్రంలోనే తొలి సారిగా జిల్లాకేంద్రంలో ఈ క్లినిక్‌ను ప్రారంభించాం. క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు బాధితు లకు అవసరమైన సలహాలు అందించడంతో పాటు వారి తరఫున వినియోగదారులు ఫారంలో పోరాడేందుకు కూడా ఈ కిన్లిక్ అండగా నిలుస్తుంది. ’అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.