Share News

support to agriculture వ్యవ‘సాయం’

ABN , Publish Date - May 06 , 2026 | 11:51 PM

support to agriculture కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పథకాలను, రాయితీలను పునరుద్ధరిస్తోంది. ఖరీఫ్‌ ప్రారంభంలోనే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించేందుకు నిర్ణయించింది.

 support to agriculture వ్యవ‘సాయం’

వ్యవ‘సాయం’

జిల్లాకు వ్యవసాయ యంత్ర, పరికరాలు మంజూరు

రూ.4.54 కోట్ల కేటాయింపు

రైతులకు రూ.1.96 కోట్ల వరకూ రాయితీ

అన్నదాతకు కూటమి ప్రభుత్వ ప్రోత్సాహం

విజయనగరం, మే 6 (ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పథకాలను, రాయితీలను పునరుద్ధరిస్తోంది. ఖరీఫ్‌ ప్రారంభంలోనే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించేందుకు నిర్ణయించింది. రూ.4.54 కోట్ల విలువైన యంత్రాలు అందజేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాంతాల వారీగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 40 హెచ్‌పీ ట్రాక్టర్లకు రూ.1.11 కోట్లు, ట్రాక్టర్‌తో ఉపయోగించే పరికరాలకు రూ.50.89 లక్షలు, విత్తునాటే యంత్రాలు రూ.3.31 లక్షలు, పవర్‌ టిల్లర్లు రూ.71.45 లక్షలు, కోత నూర్పిడి యంత్రాలు రూ.19.93 లక్షలు, ఇతర పరికరాలకు రూ.1.95 కోట్లు కేటాయించింది. తద్వారా రైతులకు రాయితీ కింద రూ.1.96 కోట్లు దక్కనున్నాయి. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 867 మంది రైతులకు రూ.4.53 కోట్ల విలువైన యంత్రాలు, పరికరాలు అందించింది. వాటి ద్వారా రైతులకు రూ.1.96 కోట్లు రాయితీ దక్కింది. సాగు యంత్రాల వల్ల వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించడంతో పాటు పెట్టుబడి కూడా ఆదా కానుంది. ముఖ్యంగా ఈ పథకంలో భాగంగా రైతులకు మినీ ట్రాక్టర్లు, దమ్ము నాగళ్లు, దుక్కిసెట్లు, స్ర్పేయర్లు, కట్టర్లు, పవర్‌ టిల్లర్స్‌, వీడర్స్‌, రోటోవేటర్స్‌ వంటివి అందనున్నాయి.

గత ఏడాది ఆయా నియోజకవర్గాల పరిస్థితులను అనుసరించి రైతులను ఎంపిక చేశారు. గజపతినగరం నియోజకవర్గంలో అత్యధికంగా 251 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. రూ.1.37 కోట్లతో యంత్ర పరికరాలు అందించారు. బొబ్బిలిలో 183 మంది రైతులకు రూ.95 లక్షల యంత్ర పరికరాలు, రాజాంలో 178 మంది రైతులకు రూ.74 లక్షల విలువ చేసే యంత్ర పరికరాలు, ఎస్‌.కోటలో 84 మంది రైతులకు రూ.45 లక్షలు విలువ చేసే పరికరాలు, నెల్లిమర్లలో 81 మంది రైతులకు రూ.55 లక్షలు విలువచేసే పరికరాలు, చీపురుపల్లిలో 70 మంది రైతులకు రూ.36 లక్షలు విలువచేసే పరికరాలు, విజయనగరం నియోజకవర్గంలో 20 మంది రైతులకు రూ.10.25 లక్షలు విలువచేసే యంత్రాలు అందించారు.

అవన్నీ ఏమయ్యాయి?

వైసీపీ హయాంలో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం అమలుచేశారు. ఈ పథకం కింద జిల్లాకు 335 ట్రాక్టర్లను అందించినట్టు చెబుతున్నారు కానీ అవి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉన్నావో తెలియడం లేదు. అప్పట్లో వైసీపీ నేతలే సమీప బంధువులను, అనుచరులను బినామీలుగా ఏర్పాటుచేసుకొని కైవసం చేసుకున్నారు. జిల్లాలో ఎక్కువగా ఎస్‌.కోట నియోజకవర్గానికి ట్రాక్టర్లు అందించారు. మొత్తం 70 ట్రాక్టర్లు అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గానికి 59, గజపతినగరం నియోజకవర్గానికి 60, చీపురుపల్లికి 37, రాజాంకు 66, విజయనగరంకు 13, నెల్లిమర్లకు 40 ట్రాక్టర్లు అందించినట్టు చెబుతున్నారు. యంత్ర పరికరాలదీ అదే తీరు. అప్పట్లో తొలి విడతలో 326 గ్రూపులకు, రెండో విడతలో 184 గ్రూపులకు యంత్రాలు అందించారు. మొదటి విడత అందించిన పరికరాల విలువ రూ.28.45 కోట్లు కాగా ఇందుకుగాను ప్రభుత్వం అందించిన రాయితీ రూ.9.34 కోట్లు, రెండో విడత పరికరాల విలువ రూ.15.10 కోట్లు.. రాయితీ రూ.4 కోట్లపైమాటే. అయితే ఇంత ఖర్చుపెట్టి అందించిన ట్రాక్టర్లు, పరికరాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. అసలు అవి మంజూరైనట్టు రైతులకు కూడా తెలియదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వాటిని సైతం వినియోగంలోకి తెస్తే రైతులకు అదనపు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

రైతులు వినియోగించుకోవాలి

సాగు యంత్రాలు రైతులకు అన్నివిధాలా ఆసరాగా ఉంటాయి. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే వాటి పంపిణీని పూర్తిచేస్తాం. ప్రాంతాలకు అనుగుణంగా పెద్దపీట వేస్తాం. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 867 మంది రైతులకు వ్యవసాయ యంత్రాలు అందించాం. విత్తనాల కొరత లేకుండా చూశాం. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.

- వీటీ రామారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, విజయనగరం

Updated Date - May 06 , 2026 | 11:51 PM