Share News

Support for women మహిళలకు తోడ్పాటు

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:47 AM

Support for women జిల్లా మహిళల ఆర్థిక తోడ్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు తాజాగా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మిల్లెట్‌ ప్రాసెసింగ్‌, బయోగ్యాస్‌, నేచురల్‌ ఫార్మింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు విజయనగరం రూరల్‌ మండల పరిధిలో 13.29 ఎకరాలను డీఆర్‌డీఏకు కేటాయించింది.

Support for women మహిళలకు తోడ్పాటు

మహిళలకు తోడ్పాటు

కీలక ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం

మిల్లెట్‌ ప్రాసెసింగ్‌, బయోగ్యాస్‌, నేచురల్‌ ఫార్మింగ్‌ యూనిట్ల రాక

డీఆర్‌డీఏకు 13.29 ఎకరాల కేటాయింపు

వేణుగోపాలపురం రెవెన్యూ పరిధిలో ఏర్పాటు

విజయనగరం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

జిల్లా మహిళల ఆర్థిక తోడ్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు తాజాగా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మిల్లెట్‌ ప్రాసెసింగ్‌, బయోగ్యాస్‌, నేచురల్‌ ఫార్మింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు విజయనగరం రూరల్‌ మండల పరిధిలో 13.29 ఎకరాలను డీఆర్‌డీఏకు కేటాయించింది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో భాగంగా సర్వే నంబర్‌ 5-3, 6-1లో ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఆ భూమిలో చిరుధాన్యాల శుద్ధి కేంద్రం, బయోగ్యాస్‌ ప్లాంట్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు, స్వయం సహాయక సంఘాల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు.

ప్రతి కుటుంబంలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని కూటమి ప్రభుత్వం తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉపాధి యూనిట్లు, చిన్నతరహా పరిశ్రమలకు రుణాలు అందిస్తామని కూడా ప్రకటించింది. మహిళా మార్టులను ఏర్పాటు చేయిస్తోంది. ఈ క్రమంలో వేణుగోపాలపురంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు యూనిట్లు ఏర్పాటుచేయాలని ఆలోచన చేసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించగా మంత్రివర్గం భూములు కేటాయిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఆ భూమి మార్కెట్‌ విలువ ప్రకారం రూ.5.81 కోట్లు డీఆర్‌డీఏ చెల్లించాల్సి ఉంటుంది.

అప్పట్లో వసూలు..

వైసీపీ ప్రభుత్వం మార్టుల పేరుతో మహిళా సంఘాల నుంచి వసూళ్లపర్వానికి తెరలేపింది. ఒక్కొక్కరి నుంచి రూ.310 చొప్పున అప్పట్లో వసూలు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రూ.10.10 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నగదుతో పెట్రోల్‌ బంకులు, కోళ్లఫారాలు, హోటళ్లు పెట్టిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. కేవలం గరివిడి, ఎస్‌.కోటలో మాత్రమే మార్టులు పెట్టించి మమ అనిపించేశారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఇలా వసూలు చేసిన సొమ్మును బ్యాంకు ఖాతాల్లో ఉంచారు. కూటమి వచ్చాక కొత్తగా ఈ భవనాల నిర్మాణానికి కదలిక వచ్చింది. కేంద్రాల ఏర్పాటుకు ఆలోచన చేసింది. విజయనగరం మండలం వేణుగోపాలపురంలో 13.29 ఎకరాలు ఆమోదయోగ్యంగా ఉంటుందని డీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల ప్రాసెసింగ్‌, షేడ్‌నెట్లను ఏర్పాటుచేయనున్నారు.

శుభ పరిణామం

విజయనగరం సమీప వేణుగోపాలపురంలో ప్రభుత్వం 13.29 ఎకరాలను డీఆర్‌డీఏకు కేటాయించడం శుభ పరిణామం. ఆహార పదార్థాల ప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు ప్రతిపాదిత కేంద్రాలను నిర్మిస్తాం. జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం సంతోషకరం.

- శ్రీనివాస్‌పాణి, డీఆర్‌డీఏ పీడీ, విజయనగరం.

----------------

Updated Date - Sep 24 , 2026 | 12:47 AM