Support for Agriculture సాగుకు సహకారం
ABN , Publish Date - May 30 , 2026 | 11:20 PM
Support for Agriculture ఖరీఫ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో పాటు వ్యవసాయ పరికరాలను రాయితీపై అందజేస్తోందన్నారు.
రైతులకు రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాల పంపిణీ
సాలూరు, మే30(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో పాటు వ్యవసాయ పరికరాలను రాయితీపై అందజేస్తోందన్నారు. శనివారం సాలూరులో గిరిజన రైతులకు విత్తనాలు, సాగు పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ ఏడాది ఖరీఫ్‌కు అవసరమైన 22వేల 348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో జనరల్ రాయితీ కింద 13వేల 465 క్వింటాళ్లు, 90 శాతం రాయితీపై 8వేల 883 క్వింటాళ్లు విత్తనాలను రైతులకు అందించనున్నాం. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను జనరల్, ఎస్సీ రైతులకు 50 శాతం, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీతో అందిస్తాం. జీలుగ, కట్టె జనుము, పిల్లిపెసర విత్తనాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తాం. ’ అని తెలిపారు. ఆ తర్వాత ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్ పథకం కింద 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సాలూరు నియోజకవర్గంలో రైతులకు 8,100 పీఎండీఎస్ కిట్లను అందజేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని తెలిపారు. భూమిలో తేమ నిల్వ, నేల సారవంతం పెంపు, రైతులకు అదనపు ఆదాయం కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్య క్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీశంకరరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయాధికారులు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.