Share News

‘వృద్ధ దంపతులపై దాడి సుపారీ గ్యాంగ్‌ పనే’

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:54 PM

కొత్తవలసలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం మేలాస్త్రి చెల్లంనాయుడు అనే వృద్ధుడు, ఆయన భార్య అప్పలలక్ష్మిపై జరిగిన దాడి సుపారీ గ్యాంగ్‌ పనే అని కొత్తవలస సీఐ షణ్ముఖరావు స్పష్టం చేశారు.

‘వృద్ధ దంపతులపై దాడి సుపారీ గ్యాంగ్‌ పనే’

కొత్తవలస, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కొత్తవలసలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం మేలాస్త్రి చెల్లంనాయుడు అనే వృద్ధుడు, ఆయన భార్య అప్పలలక్ష్మిపై జరిగిన దాడి సుపారీ గ్యాంగ్‌ పనే అని కొత్తవలస సీఐ షణ్ముఖరావు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించా రు. కొత్తవలసకు చెందిన చెల్లంనాయుడు.. తన మొదటి భార్య, కుమారుడు చనిపోవడంతో కొన్నేళ్ల కిందట వేపాడ మండలం, బల్లంకి గ్రామానికి చెందిన డేగల సన్యాశినాయుడు ఉరఫ్‌ మేలాస్త్రి గణేష్‌ను దత్తత తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత చెల్లంనాయుడు రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పుట్టిన కుమారుడిని పెంచుకుంటున్నాడు. ఈక్రమంలో గణేష్‌ను నిర్లక్ష్యం చేశాడు. దీంతో గణేష్‌ మళ్లీ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి.. చెల్లంనాయుడిపై కక్ష పెంచుకున్నాడు. చెల్లంనాయుడును హత మార్చేందుకుగాను రూ.5లక్షల 50 వేలకు విశాఖపట్టణం నాయుడుతోటకు చెందిన శ్రీలంకమనోహర్‌, మొండి బ్రహ్మయ్య, రవి అజయ్‌కాంత్‌, శ్రీలం రాజేష్‌, చింతల రాంబాబు అను వారితో బేరం కుదుర్చుకున్నాడు. రూ.50వేలను అడ్వాన్సుగా ఇచ్చాడు. వీరందరూ ముందుగా కొత్తవలసలోని చెల్లంనాయుడు ఇంటి వద్ద రెక్కీ వేశారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఇంటిలో ఉన్న చెల్లంనాయుడుపై దాడి చేశారు. ఇనుప రాడ్డుతో తలపై కొట్టారు. అలాగే భార్య అప్పలలక్ష్మిని మెడపై కత్తితో గాయపర్చారు. ప్రస్తుతం చెల్లంనాయుడు విశాఖపట్టణం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. భార్య అప్పలలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుమేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులను పెందుర్తి జంక్షన్‌లో సోమవారం పట్టుకుని, అరెస్టు చేశారు. వారిని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారిని కొత్తవలస కోర్టులో హాజరు పర్చారు.

Updated Date - Mar 23 , 2026 | 11:54 PM