Share News

క్షణికావేశంలో బలవన్మరణం

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:32 AM

ప్రేమించిన అమ్మాయి విషయంలో తన తల్లిదండ్రులు, అమ్మాయి కుటుంబీకుల చర్చల మధ్య నలిగిపోయి.. ఎటూ తేల్చుకోలేక.. క్షణికావేశంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

క్షణికావేశంలో బలవన్మరణం

  • కోటగండ్రేడులో యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి విషయంలో తన తల్లిదండ్రులు, అమ్మాయి కుటుంబీకుల చర్చల మధ్య నలిగిపోయి.. ఎటూ తేల్చుకోలేక.. క్షణికావేశంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.

గుర్ల, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోటగండ్రేడు గ్రామానికి చెందిన వనుము దాలినాయు డు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా, చిన్నవాడైన దేవకీనందన్‌(21) డిగ్రీ వరకు చదువుకున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించినట్టు ఆ యువకుడు ఇటీవల తల్లిదండ్రులతో చెప్పాడు. కొద్ది రోజుల వరకు ఆ రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. ఈక్ర మంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకు వచ్చారు. కొంత సమయం కావాలని దాలినాయుడు వారిని కోరారు. ఇంతలో వారి మధ్య మనస్పర్థలు పెరిగి పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత రెండు నెలలుగా తగువు ముగిసింది. ఇంతలో ఆదివారం రాత్రి అమ్మాయి కుటుంబీకులు వచ్చి.. రేపు ఉదయమే పెళ్లి ముహూర్తం తీయాలని దాలినాయుడు కుటుంబ సభ్యులను తొందరపెట్టారు. దీంతో దాలినాయుడు కుటుంబీకులు తమకు కొంత సమయం కావాలని వేడుకున్నారు. ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. అనంతరం అందరూ నిద్రించిన తర్వాత సోమవారం తెల్లవారుజామున దేవకీనందన్‌ ఇంటి నుంచి పొలం వైపు బైక్‌పై వెళ్లి.. నూతనంగా నిర్మిస్తున్న ఇంటి మధ్యలో ఉరి వేసుకున్నాడు. ముందుగా ఇంటికి సమాచారం కూడా అందించాడు. ఇంతలో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లేసరికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. దీంతో యువకుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబీకులు భోరున విలపిస్తూ.. పెళ్లి కుమార్తె బంధువులు, గ్రామపెద్దలు తమ కుటుంబానికి అన్యాయం చేశారంటూ ఆందోళన దిగారు. కొంతసేపు గందరగోళం సృష్టించారు. ఇంతలో గుర్ల ఎస్‌ఐ నారాయణరావు తన సిబ్బందితో అక్కడ చేరుకుని వారిని వారించారు. ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసి నిజనిజాలను వెల్లడిస్తామని ఎస్‌ఐ చెప్పడంతో కొంతమంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:32 AM