Sugarcane farmers rally in protest కదంతొక్కిన చెరకు రైతులు
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:07 AM
Sugarcane farmers rally in protest ‘క్రషింగ్ మూసివేత నిర్ణయాన్ని వారం రోజుల్లో ఉపసంహరించుకోవాలి.. యాజమాన్యం సానుకూలంగా స్పందించేవరకు ఉద్యమం ఆగదు.. రైతు వ్యతిరేక చర్యలకు దిగవద్దు.. చెరకు రైతుల సమస్యపై అన్ని పక్షాలు స్పందించాలి’ అంటూ వందలాది మంది రైతులు నినదించారు.
కదంతొక్కిన చెరకు రైతులు
సంకిలి రోడ్డులో భారీ ర్యాలీతో నిరసన
క్రషింగ్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
యాజమాన్యానికి వారం రోజులు గడువు
రేగిడి, అక్టోబరు 3,(ఆంధ్రజ్యోతి): ‘క్రషింగ్ మూసివేత నిర్ణయాన్ని వారం రోజుల్లో ఉపసంహరించుకోవాలి.. యాజమాన్యం సానుకూలంగా స్పందించేవరకు ఉద్యమం ఆగదు.. రైతు వ్యతిరేక చర్యలకు దిగవద్దు.. చెరకు రైతుల సమస్యపై అన్ని పక్షాలు స్పందించాలి’ అంటూ వందలాది మంది రైతులు నినదించారు. ఉమ్మడి జిల్లా చెరకు రైతులు శనివారం చెరకు పరిరక్షణ కమిటీ, ఏపీ రైతుసంఘం, సీఐటీయు ప్రతినిధుల అధ్వర్యంలో సంకిలి హైస్కూల్ నుంచి చక్కెర కర్మాగారం వరకు పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. పాలకొండ, రేగిడి, సంతకవిటి, వీరఘట్టాం, వంగర తదితర మండలాల నుంచి అధికంగా రైతులు తరలివచ్చి ఫ్యాక్టరీని కాపాడుకుంటాం అని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం సుగర్ కేన్ గేట్ ఎదుట సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రైతుసంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం పదికాలలు ఉండేలా కలిసికట్టుగా పోరాడదామని, వచ్చే ఏడాది క్రషింగ్ సీజన్ మూసివేస్తామన్న యాజమాన్యం ప్రకటన విరమించుకొనేవరకు ఉద్యమం ఆగదని స్పష్టంచేశారు. ఈప్రాంతంలో చెరకుసాగుకు అలవాటు పడ్డ రైతాంగానికి వ్యతిరేకంగా యాజమాన్యం వ్యవహరించవద్దని, చెరకు సాగులేదని చూపించి ఫ్యాక్టరీ మూసివేతకు ప్రయత్నించి రైతులకు అన్యాయం చేయొద్దన్నారు.
సహకరించకుంటే ఉద్యమం ఉధృతం
సుగర్ ఫ్యాక్టరీ జీఎం సూర్యతేజతో సమావేశమైన చెరకు పరిరక్షణ కమిటీ, ఏపీ రైతుసంఘం ప్రతినిధులు కొన్ని డిమండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. వచ్చే ఏడాది క్రషింగ్ సీజన్ మూసివేస్తున్న ప్రకటన వారంరోజుల్లో ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌తో సమావేశం ఏర్పాటుచేయాలని, సుగర్ అనుబంధ సంస్ధలు మూసివేయాలని, వాటిని అడ్డుకొనేందుకు సైతం వెనకాడబోమని రైతులు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి బుడితి అప్పలనాయుడు, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులు కిమిడి సూరపనాయుడు, కింజరాపు సురేష్ గొలివి జగ్గునాయుడు, చింతా సంగంనాయుడు, నిష్టల సూర్యప్రకాశ్‌భుక్త, గేదల రామకృష్ణ, నీలకంఠం, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సురేష్, ప్రజా గాయకుడు దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు.