Such negligence? ఇంత నిర్లక్ష్యమా?
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:05 AM
Such negligence? ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్), అనుబంధ ఘోషాసుపత్రిలో ఉచిత సేవలు అందుతాయని ఆశగా వస్తున్న పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. కీలకమైన విభాగాల్లో సేవలు సరిగా అందడం లేదు.
ఇంత నిర్లక్ష్యమా?
జీజీహెచ్‌లో ఎక్స్‌రే గదులకు తాళాలు
ఘోషాసుపత్రిలో గర్భిణులకు అందని అలా్ట్ర సౌండ్ సేవలు
పర్యవేక్షించని విభాగాధిపతులు
ప్రైవేటు సెంటర్లను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్న బాధితులు
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్), అనుబంధ ఘోషాసుపత్రిలో ఉచిత సేవలు అందుతాయని ఆశగా వస్తున్న పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. కీలకమైన విభాగాల్లో సేవలు సరిగా అందడం లేదు. వాటిని పరిశీలించి, పర్యవేక్షించాల్సిన విభాగాధిపతులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చివరకు ప్రైవేటు రేడియో డయోగ్నోసిస్ సెంటర్లను ఆశ్రయించి పేదలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జీజీహెచ్‌లో ఎక్స్‌రే, ఘోషాసుపత్రిలో అలా్ట్ర సౌండ్ స్కాన్ సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
విజయనగరం రింగురోడ్డు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యంత కీలకమైన రేడియో డయోగ్నోసిస్ విభాగం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. విభాగాధిపతిగా వున్న ఓ వైద్యుడు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించడం లేదు. పర్యవేక్షణ కూడా లోపించడంతో కిందిస్థాయి విభాగాలన్నీ అస్తవ్యస్తంగా మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. డిజిటల్ ఎక్స్‌రే, 600 ఎంఏ ఎక్స్‌రే విభాగాల వద్ద సంబంధిత టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో శనివారం సిబ్బంది తాళాలు వేశారు. రోజుకు 200 మందికి పైగా రోగులు ఎక్సరే సేవల కోసమే వస్తుంటారు. తాజాగా తాళాలు వేసిన తలుపులను చూసి వెనుతిరిగారు. సమస్యను సరిదిద్ది సేవలను పునరుద్ధరించాల్సిన హెచ్‌వోడీ నిర్లిప్తంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఆసుపత్రికి వచ్చిన పేద రోగులు వేరే దారిలేక బయట ప్రైవేటు డయోగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తూ వేలాది రూపాయలు చెల్లించుకుంటున్నారు.
ఘోషాసుపత్రిలో గర్భిణులకు చుక్కలు !
ఘోషాసుపత్రిలో గర్భిణుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. శిశువు ఎదుగుదలను, ఉమ్మనీటి శాతాన్ని తెలుసుకునేందుకు ఆలా్ట్ర సౌండ్ స్కానింగ్ అత్యంత కీలకం. అయితే ఘోషాసుపత్రిలో ఓపీకి వచ్చే గర్భిణులకు అలా్ట్ర సౌండ్ స్కానింగ్ తీయడంలేదు. కేవలం ఆసుపత్రిలో ఇన్‌పెషేంట్లుగా చేరిన ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే స్కానింగ్ పరిమితం చేశారు. అయితే రోజు విడిచి రోజు ఓపీ ద్వారా వచ్చిన గర్భిణులకు మాత్రమే స్కానింగ్ తీస్తున్నారు. మధ్యలో సెలవులు వస్తే సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ఆందోళనతో దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు స్కానింగ్ తీయకపోవడంతో చివరికి ప్రైవేటు స్కానింగ్‌నకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.
పత్తాలేని హెచ్‌వోడీ
ఉన్నత స్థాయి అర్హతలు కలిగిన వైద్యులు అందుబాటులో వున్నప్పటికీ రేడియో డయోగ్నోసిస్ విభాగంలో నిర్లక్ష్యపు ధోరణి కొనసాగడం వెనుక హెచ్‌వోడీ పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడంతోనే కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు అంటున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఎక్సరే, అలా్ట్ర సౌండ్ విభాగాల్లో పూర్తిస్థాయి సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టరు అల్లు పద్మజను వివరణ కోరగా, ఆసుపత్రిలోని ఎక్సరే విభాగానికి తాళాలు వేయడం, గర్భిణులకు అల్ర్టా సౌండ్ స్కానింగ్ నిలిచివేతపై విచారణ జరుపుతామన్నారు. ఓపీ రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ రెండింటి సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామన్నారు.