Share News

పారాది వంతెనపై ట్రయల్‌ రన్‌ విజయవంతం

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:19 AM

నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం దిశగా మరో ముందడుగు పడింది.

పారాది వంతెనపై ట్రయల్‌ రన్‌ విజయవంతం
ట్రయల్‌ రన్‌ ప్రారంభిస్తున్న బుడా చైర్మన్‌ లక్ష్మునాయుడు

బొబ్బిలి రూరల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం దిశగా మరో ముందడుగు పడింది. పారాది వద్ద వేగవతి నదిపై నిర్మించిన వంతెనపై సోమవారం ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. బుడా చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు జెండా ఊపి ట్రయల్‌ రన్‌ను ప్రారంభించారు. సుమారు 17.50 కోట్లతో పారాది వంతెనను నిర్మించారు. ఈ సందర్భంగా బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే బేబీనాయన కృషి ఫలితంగా పారాది వంతెన పనులు పూర్తయ్యాయన్నారు. బొబ్బిలి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనితలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారాది వంతెన అందుబాటులోకి వస్తే ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇన్‌చార్జి గిరిబాబు, టీడీపీ నాయకుడు ఎ.భాస్కరరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ జేమ్స్‌, డీఈఈ శ్రీని వాస్‌, జేఈ బీకే రాజు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:19 AM