ఆదాయం ఘనం..అభివృద్ధి శూన్యం
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:42 PM
ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మార్కెట్ యార్డుల కంటే పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డు సంత ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ.
- ఏఎంసీ సంతలో కనీస సౌకర్యాలు కరువు
- శిథిలమైన నీటి తొట్టెలు
-మూలకు చేరిన శుద్ధజల కేంద్రం
-రైతులు, వ్యాపారులకు తప్పని ఇబ్బందులు
- అభివృద్ధిపై అధికారుల నిర్లక్ష్యం
పార్వతీపురంటౌన్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మార్కెట్ యార్డుల కంటే పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డు సంత ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. ప్రతి గురువారం జరిగే ఈ సంత ద్వారా ఏడాదికి సుమారు రూ.79 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అంతే కాకుండా గడ్డి వేలం ద్వారా మరికొంత ఆదాయం వస్తుంది. అలాంటి సంతలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మానాపురం, గుమ్మలక్ష్మీపురంలో జరిగే సంతల కంటే పార్వతీపురం మార్కెట్ యార్డు పరిధిలో జరిగే సంతకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పశువులు, మేకలు, గొర్రెల క్రయ విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. అలాంటి సంతను అభివృద్ధి చేయడంతో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు, వ్యాపారులు దాహార్తిని తీర్చుకునేందుకు సంతలో కనీసం నీటి సదుపాయం లేదు. పదేళ్ల కిందట రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రం మూలకు చేరింది. దీంతో షాపుల్లో రూ.10 నుంచి రూ.20కు వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నారు. అదే విధంగా మూగజీవాలకు కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో అల్లాడిపోతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులోని నీరు కూడా కలుషితం కావడంతో రైతులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతలో కనీసం శుభ్రత ఉండదు. గడ్డి, వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా ఉంటుంది. సంత నుంచి ఏడాదికి రూ.80 లక్షల ఆదాయం వస్తున్నా సౌకర్యాల కల్పనపై ఏఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా సంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై మార్కెట్ యార్డు కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ శ్రీనివాసరావును వివరణ కోరగా.. సంత అభివృద్ధి కోసం ఏఎంసీ చైర్మన్ జి.గౌరీతో పాటు డైరెక్టర్‌లు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.