Share News

But What About Quality? రాయితీ సరే... నాణ్యత సంగతేంటి?

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:32 PM

Subsidy is Fine… But What About Quality? ట్రైకార్‌ పథకంలో భాగంగా గిరిజన ఉపప్రణాళిక నిధులతో 90శాతం రాయితీపై పంపిణీ చేయనున్న యంత్ర పరికరాల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈప్రాంత గిరిజన రైతులకు అవి ఎంతవరకు ఉపయోగపడ తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 But What About Quality? రాయితీ సరే...  నాణ్యత సంగతేంటి?
ఐటీడీఏకు సరఫరా అయిన మినీట్రాక్టర్లు

  • ఇండెంట్‌ ఒకటి....సరఫరా అయినవి మరొకటి

  • కొండ ప్రాంతాల్లో ఉపయోగపడని మినీట్రాక్టర్లు

  • హార్స్‌పవర్‌ చాలని పవర్‌టిల్లర్లు

  • ఎవరికీ తెలియని కంపెనీల పేర్లు

  • పెదవి విరుస్తున్న గిరిజన సంఘాలు

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ట్రైకార్‌ పథకంలో భాగంగా గిరిజన ఉపప్రణాళిక నిధులతో 90శాతం రాయితీపై పంపిణీ చేయనున్న యంత్ర పరికరాల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈప్రాంత గిరిజన రైతులకు అవి ఎంతవరకు ఉపయోగపడ తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు ఎవరూ వినని, కనని కంపెనీలకు చెందిన మినీట్రాక్టర్లు, హార్స్‌పవర్‌ చాలని పవరటిల్లర్లు కొద్దిరోజుల కిందటే సీతంపేట ఐటీడీఏకు చేరుకున్నాయి. వాస్తవంగా గిరిజన రైతుల డిమాండ్‌ మేరకు ఐటీడీఏ హార్టికల్చర్‌ అధికారులు యంత్ర పరికరాల కోసం ఇండెంట్‌ను ప్రతిపాదించారు. అయితే వీరి ప్రతిపాదనలను పక్కకు పెట్టి అక్కరకు రాని యంత్ర పరికరాలు సరఫరా అయ్యాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలో రెండు ఐటీడీఏలకు ఆయిల్‌ ఇంజన్లు, పవర్‌టిల్లర్లు, పవర్‌ వీడర్‌, మినీట్రాక్టర్లు, మల్టీక్రాప్‌ ట్రెషర్స్‌ వంటి వ్యవసాయ యంత్ర పరికరాలు సరఫరా అయ్యాయి. సీతంపేట ఐటీడీఏకు రూ.3.34కోట్లు, పార్వతీపురం ఐటీడీఏకు రూ.3.55కోట్లతో ఈ వ్యవసాయ పరికరాలను సెంట్రలైజ్‌డ్‌ టెండర్ల విధానం ద్వారా సరఫరా చేశారు. తురాయిపువలస ఉద్యాన నర్సరీలో ఉన్న వాటిని చూసి గిరిజన రైతులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. తామెప్పుడూ వాటి కంపెనీల పేర్లు వినలేదని చెబుతున్నారు.

- అర్హులైన గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా 90శాతం రాయితీతో పంపిణీ చేయనున్న 25 మినీట్రాక్టర్లు ప్రముఖ కంపెనీల(స్వరాజ్‌,మహీంద్రా,సోనాలిక,జాన్‌డీర్‌)కు చెందినవి కావు. కెప్టెన్‌ కంపెనీకి చెందిన వాటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కెప్టెన్‌ కంపెనీకి చెందిన ఒక్కో మినీట్రాక్టర్‌ ధర రూ.5.60లక్షలు. ఇదే ధరకు ప్రముఖ కంపెనీలకు చెందిన మినీట్రాక్టర్లను కొనుగోలు చేసి పంపిణీ చేయొచ్చు. కానీ అలా చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కెప్టెన్‌ కంపెనీకి చెందిన మినీట్రాక్టర్ల సర్వీసింగ్‌ సెంటర్‌లు పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కడ లేవని గిరిజన రైతులు చెబుతున్నారు.

- ఇక రాయితీ కింద అందించనున్న పవర్‌ టిల్లర్‌ యంత్రాలు పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. అధికారులు పంపిన ఇండెంట్‌ ప్రాప్తికి 15హెచ్‌పీ(హార్స్‌పవర్‌) కలిగిన వాటిని సప్లయ్‌ చేయాల్సి ఉంది. కానీ సీతంపేట ఐటీడీఏకు 13హెచ్‌పీ పవర్‌ కలిగిన 28 పవర్‌టిల్లర్లు సరఫరా చేశారు. పార్వతీపురం ఐటీడీఏకు కూడా 5హెచ్‌పీ(హార్స్‌పవర్‌)కలిగిన ఆయిల్‌ ఇంజన్‌లు సరఫరా చేయాల్సి ఉండగా 3హెచ్‌పీ పవర్‌ కలిగిన 14ఆయిల్‌ ఇంజన్‌లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా యంత్ర పరికరాల పంపిణీకి ముందే డొల్లతనం బయటపడుతోంది.

పేమెంట్ల కోసం ఒత్తిళ్లు

ఈ సెంట్రలైజ్‌డ్‌ టెండర్‌ల ప్రక్రియలో రాష్ట్రస్థాయిలోని ట్రైకార్‌ విభాగంలో ఓ కీలక అధికారి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిఽధిలోని గిరిజన రైతులకు ఈ యంత్ర పరికరాలను ఇంకా పంపిణీ చేయకుండానే వీటికి సంబంధించిన పేమెంట్‌లు క్లియర్‌ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ ఐటీడీఏ సిబ్బందికి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించి గిరిజన రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలు సరఫరా జరిగేలా చూడాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే..

‘ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్‌ నిధులతో సెంట్రలైజ్‌డ్‌ టెండర్ల ద్వారా ఐటీడీఏకు చేరిన యంత్ర పరికరాలను పరిశీలిస్తాం. గిరిజన రైతులకు నాణ్యమైన పరికరాలు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటాం.’ అని ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 11:32 PM