Share News

ప్రతి విషయం విద్యార్థులకు తెలియాలి

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:22 AM

పాఠశాలలో చేపడుతున్న ప్రతి కార్యక్రమం, ప్రతి విషయం విద్యార్థులకు తెలియాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి ఉపాధ్యాయులకు ఆదేశించారు.

  ప్రతి విషయం విద్యార్థులకు తెలియాలి
విద్యార్థులతో కృత్యాలు చేయిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి:

సాలూరు, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పాఠశాలలో చేపడుతున్న ప్రతి కార్యక్రమం, ప్రతి విషయం విద్యార్థులకు తెలియాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి ఉపాధ్యాయులకు ఆదేశించారు. శనివారం మండలంలోని శివరాంపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. విద్యార్థుల హాజరును పరిశీలించారు. పాఠశాలకు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టర్‌ నేరుగా ఫోన్‌చేసి ఎందుకు హాజరుకాలేదని కారణాలను అడిగితెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే పాఠశాలలో ఏఎన్‌ఎంకు తెలియజేయాలని, ఏఎన్‌ఎం పూర్తిగా తెలుసు కోవాలని, ప్రతి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏఎన్‌ఎం తెలుసుకొని సంబం ధిత పీహెచ్‌సీ వైద్యాధికారులకు తెలియజేయాలన్నారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు కూడా పిల్లలకు అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య నియమాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు.

విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడంపై అసహనం

గ్రామంలో సుమారు వంద మంది వరకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం పట్ల కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వివిధ ప్రశ్నలు అడిగి వారిలో ఉన్న విద్యా నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో పలు కృత్యాలు, పాటలను పాడించి విద్యార్థులను ఉత్తేజపరిచారు.

వ్యవసాయాధికారులపై మండిపాటు

శివరాంపురం మండలంలోని పలువురు అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యవసాయాధికారులు కలెక్టర్‌ వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సమాచారంతో రాకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎప్పటి కప్పుడు చేపడుతున్న ప్రతి పథకం గురించి కూడా ప్రజలకు తెలియాల్సి ఉందని, అప్పుడు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమైనట్లని తెలిపారు. కార్య క్రమంలో ఎంపీడీవో పార్వతితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:22 AM