students facing problems చిన్నా.. పెద్ద కష్టమే!
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:14 AM
students facing problems చిన్న పిల్లలు పెద్ద కష్టాలు పడుతున్నారు. చదువుకోవడానికి కొండలు దిగుతున్నారు. వాగులు దాటుతున్నారు. పొదల నడుమ నడుస్తున్నారు. ఆపై రహదారి రెయిలింగ్ కిందకు దూరి ఆవలకు చేరుకుంటున్నారు. దాదాపు 2 కిలోమీటర్లు పైబడి అవస్థలు పడుతూ కాలినడకన పాఠశాలకు చేరుకుంటున్న జీలికవలస గ్రామ గిరిజన విద్యార్థుల కష్టాలు చూసేవారెవరైనా నిర్ఘాంతపోవాల్సిందే.
చిన్నా.. పెద్ద కష్టమే!
కొండలు దిగి, గెడ్డలు దాటి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
కాలినడకన 2 కిలోమీటర్ల ప్రయాణం
రామభద్రపురం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): చిన్న పిల్లలు పెద్ద కష్టాలు పడుతున్నారు. చదువుకోవడానికి కొండలు దిగుతున్నారు. వాగులు దాటుతున్నారు. పొదల నడుమ నడుస్తున్నారు. ఆపై రహదారి రెయిలింగ్ కిందకు దూరి ఆవలకు చేరుకుంటున్నారు. దాదాపు 2 కిలోమీటర్లు పైబడి అవస్థలు పడుతూ కాలినడకన పాఠశాలకు చేరుకుంటున్న జీలికవలస గ్రామ గిరిజన విద్యార్థుల కష్టాలు చూసేవారెవరైనా నిర్ఘాంతపోవాల్సిందే. వివరాల్లోకి వెళితే..
రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయతీ శివారు జీలికవలస గ్రామ గిరిజన విద్యార్థులు ప్రతిరోజూ జమ్మువలస ప్రాథమిక పాఠశాలకు వెళుతుంటారు. స్కూల్‌కు వెళ్లడానికి రోడ్డు లేదు. కొండలు దిగి, గెడ్డలు దాటి పొదల మధ్య నుంచి నడిచి వెళ్లాల్సిందే. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న 16 మంది పిల్లలు నిత్యం కేజీల బరువుతో ఉన్న పుస్తకాల బ్యాగులు మోస్తూ పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. వర్షాకాలంలో గెడ్డలు నిండితే వాటిని దాటుకుని వెళ్లాల్సిందే. ఇటీవల నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ 6లేన్ రోడ్డు దాటడం మరో సవాల్. విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి ఏడాది క్రితం గ్రామానికి వచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు విన్నవించామని స్థానికుడు జన్ని రవి తెలిపారు.