విద్యార్థులే లక్ష్యంగా!
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:19 AM
గంజాయి, నల్లమందు వంటి మాదకద్రవ్యాలకు జిల్లా అడ్డాగా నిలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
- గంజాయి విక్రయాలు
- అంతా వాట్సాప్ గ్రూపుల్లోనే..
-ఖాళీ లేఅవుట్లు, తోటలను అడ్డాగా చేసుకుంటున్న వైనం
- అంతర్రాష్ట్ర రహదారుల గుండా జిల్లాలోకి సరుకు
-పోలీసుల తనిఖీలు మృగ్యం
విజయనగరం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): గంజాయి, నల్లమందు వంటి మాదకద్రవ్యాలకు జిల్లా అడ్డాగా నిలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు, యువకులను గంజాయి ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రధానంగా 20 సంవత్సరాల్లోపు ఉన్నవారిని పక్కా ప్రణాళికతో గంజాయికి అలవాటు చేస్తున్నారు. గంజాయి తాగడం ఒక ఫ్యాషన్ అని వారికి నూరు పోస్తున్నారు. ఇందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు నడుపుతున్నారు. పలానా చోట గంజాయి దొరుకుతుందని కోడ్ సంభాషణ ద్వారా చెప్పుకుంటున్నారు. మద్యం కంటే తక్కువ ధరకు లభిస్తుండడం, నిషా ఎక్కువగా ఇస్తుండడంతో యువత గంజాయికి ఆకర్షితులవుతున్నారు.
ఆ ప్రాంతాల్లోనే అధికం..
జిల్లాలోని భోగాపురం, విజయనగరం, బొబ్బిలి, రాజాం, కొత్తవలసలో విద్యాసంస్థలు అధికంగా ఉన్నాయి. జల్సాలకు అలవాటుపడిన కొందరు యువకులు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడికి తెస్తున్నారు. కాలేజీల సమీపంలోని ఖాళీ లేఅవుట్లను అడ్డాగా చేసుకొని విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా జల్సాలకు అలవాటుపడిన వారిని గంజాయి వ్యాపారులు టార్గెట్ చేసుకుంటున్నారు. వారికి డబ్బు ఆశచూపి ఈ రొంపిలోకి దించుతున్నారు. పోలీసుల తనిఖీల్లో వీరు పట్టుబడుతుండగా, అసలైన వారు తప్పించుకుంటున్నారు. కొందరు మైనర్లు సైతం గంజా యికి అలవాటుపడడం ఆందోళన కలిగిస్తోంది. చిన్ననాటి నుంచే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ నిండు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.
కొన్ని ఉదాహరణలు..
- బొబ్బిలిలో విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న 11 మంది ముఠాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర్, ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. సీతానగరం ప్రాంతానికి చెందిన ఓ డ్యాన్స్ మాస్టర్ విద్యార్థులు, యువతకు డ్యాన్స్ నేర్పుతానని చెప్పి వారిని గంజాయి ముగ్గులోకి దించినట్లు పోలీస్ విచారణలో తేలినట్టు తెలుస్తోంది.
- విజయనగరంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు గంజాయితో ఇటీవల పట్టుబడ్డాడు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ యువకుడు జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతున్నాడు.
- గతంలో వైసీపీకి చెందిన ఓ యువకుడు గంజాయితో పట్టుబడ్డాడు. ఓ కానిస్టేబుల్ వైసీపీ నాయకులతో మాట్లాడి సెటిల్మింట్ చేసుకుందామనుకున్నాడు. విషయం బయటకు పొక్కడంతో ఆ కానిస్టేబుల్ సస్పెండ్ అయినట్లు తెలిసింది.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి..
జిల్లాకు ఒడిశాతో పాటు ఛత్తీస్‌గఢ్‌తో అనుబంధం ఎక్కువ. ఆపై విశాఖ, పార్వతీపురం మన్యం వెళ్లాలంటే జిల్లా మీదుగా వెళ్లాలి. రోడ్డు, రైలు మార్గం ఉంది. ఇదే ఇప్పుడు మాదకద్రవ్యాల రవాణా, వినియోగం, విక్రయానికి కారణమవుతోంది. ఒడిశాలోని జైపూర్, కొరాపుట్, రాయగడ జిల్లాలకు సంబంధించి అంతర్ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఈ రోడ్లలో కనీస తనిఖీలు లేవు. ఉన్న చెక్ పోస్టులను సైతం ఎత్తేశారు. ప్రత్యేక పోలీసులను విధుల నుంచి తొలగించారు. దీంతో తనిఖీలు మృగ్యమయ్యాయి. దీంతో గంజాయి రవాణాదారులు, ముఠాలు ఇష్టారాజ్యంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. స్థానిక యువతతో ఒప్పందం చేసుకుంటున్నారు. వారితోనే గంజాయిని విక్రయిస్తున్నారు. ఈ మార్గాల్లో పోలీసులు నిఘా పెడితే గంజాయి అక్రమార్కుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కాలేజీల సమీపంలోని లేఅవుట్లతో పాటు తోటల్లో సోదాలు నిర్వహిస్తే ఫలితం ఉంటుంది.
నిఘా పెట్టాం
జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. వాటి రవాణా, వినియోగంపై కూడా దృష్టిసారించాం. ఇప్పటికే అనేక మంది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. అధిక మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా డ్రోన్ , సీసీ కెమెరాలు, నిరంతర పోలీస్ గస్తీతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశాం. పిల్లల నడవికను తల్లితండ్రులు గమనించాలి. ఎక్కడైనా గంజాయి కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలి.
- ఏఆర్ దామోదర్ ఎస్పీ, విజయనగరం