Student kidnapping scandal in Bobbili బొబ్బిలిలో విద్యార్థి కిడ్నాప్ కలకలం
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:20 AM
Student kidnapping scandal in Bobbili బొబ్బిలి పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం సాయంత్రం బైకుపై వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఆదివారం ఉదయానికి కలకలం రేగింది. బాధిత బాలుడే తప్పించుకుని వచ్చి ఆ వివరాలు తెలిపాడు. అయితే ఎలా జరిగింది? ఎవరు తీసుకెళ్లారు అన్న అంశాలపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు. సీసీ ఫుటేజీలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
బొబ్బిలిలో విద్యార్థి కిడ్నాప్ కలకలం
నిర్ధారణకు పోలీసుల మల్లగుల్లాలు
సీసీ ఫుటేజీల సమగ్ర పరిశీలన
బొబ్బిలి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం సాయంత్రం బైకుపై వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఆదివారం ఉదయానికి కలకలం రేగింది. బాధిత బాలుడే తప్పించుకుని వచ్చి ఆ వివరాలు తెలిపాడు. అయితే ఎలా జరిగింది? ఎవరు తీసుకెళ్లారు అన్న అంశాలపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు. సీసీ ఫుటేజీలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
మెంటాడ మండలం ఓ గ్రామానికి చెందిన బాలుడు బొబ్బిలిలో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో స్కూలులో పరీక్ష రాసిన తరువాత హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి మత్తుమందు రుమాలును ముఖానికి అట్టిపెట్టి విజయనగరం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అలా ఎత్తుకుపోతున్న సమయంలో దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామ సమీపంలోకి వచ్చేసరికి బాలుడికి తెలివి రావడంతో బైకు పైనుంచి ఒక్క ఉదుటున దూకేశాడు. ఆపై రోడ్డు పక్కన ఉన్న పొదల్లో దాక్కున్నానని, ఆ తరువాత రోడ్డుపై వెళుతున్న వాహనదారుని సహాయంతో శనివారం రాత్రికల్లా ఇంటికి చేరుకున్నట్లు ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు.
నిర్ధారణ కోసం పోలీసుల మల్లగుల్లాలు
విద్యార్థి కిడ్నాప్ వ్యవహారంలో నిజమెంత అన్నదానిపై నిర్ధారణ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు లేకపోయినప్పటికీ సూమోటోగా ఐడీ పార్టీ పోలీసులు ఆరా తీసేందుకు ముందుకొచ్చారు. విద్యార్థి, అతని తండ్రిని, బంధువును వెంట తీసుకొని ఆదివారం ఉదయమంతా మెయిన్‌రోడ్డులోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం టెక్నీషియన్‌ను రప్పించారు.
ఆరా తీస్తున్నాం
కింతలి నారాయణరావు, బొబ్బిలి సీఐ
విద్యార్థి కిడ్నాప్‌నకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి గాని, విద్యాసంస్థ నుంచి గాని ఎటువంటి ఫిర్యాదు రాలేదు. అయినా ఇందులో నిజమెంత? అనే దానిపై నిర్ధారణ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నాం. విద్యార్థి చెబుతున్న అంశాల ఆధారంగా అన్నిటినీ పరిశీలిస్తున్నాం.