Share News

పింఛన్‌ దరఖాస్తులకు పాట్లు

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:01 PM

సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు పెద్దఎత్తున సచివాలయాలకు తరలివస్తున్నారు.

 పింఛన్‌ దరఖాస్తులకు పాట్లు
సీతంపేట సచివాలయంలో వేచిఉన్న దరఖాస్తుదారులు

- మరో ఆరు రోజులే గడువు

- వెంటాడుతున్న సాంకేతిక ఇబ్బందులు

- కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం పడిగాపులు

- అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు

సీతంపేట, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు పెద్దఎత్తున సచివాలయాలకు తరలివస్తున్నారు. మరో ఆరు రోజులే గడువు ఉండడంతో దరఖాస్తు చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. అయితే, దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌ చేసేందుకు పలు సచివాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇబ్బందిగా మారింది. ఒక్కో దరఖాస్తుదారుని వివరాలను నమోదు చేయడానికి గంటకు పైగా సమయం పడుతుండడంతో సచివాలయ సిబ్బంది తలలుపట్టుకుంటున్నారు. ఒకపక్క సమయం తక్కువగా ఉండడం, మరోపక్క సర్వర్‌ సమస్య వెంటాడుతుండడంతో దరఖాస్తుదారులు గంటల తరబడి సచివాలయాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఓటరు కార్డ్డు లేక డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ అప్‌డేషన్‌ పత్రంతో పాటు ఆయా కేటగిరీని బట్టి సంబంధిత పత్రాలను సచివాయాలకు తీసుకువెళ్లాల్సి ఉంది. వీటితో పాటు ఆధార్‌ కార్డుకు లింక్‌ అయిన మొబైల్‌ను అందుబాటులో ఉంచుకుంటే చరవాణికి వచ్చే ఓటీపీ ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌ చేస్తారు. వీటిలో ఏ ఒక్క ధ్రువపత్రం లేకపోయినా ఇబ్బందులు తప్పవు. అయితే, ధ్రువపత్రాలను పొందేందుకు తహసీల్దార్‌ కార్యాలయాలు, మీసేవ కేంద్రాలు, ఇంటర్నెట్‌ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా కొందరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కుల, ఆదాయ ధ్రువపత్రాలను మంజూరు చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆధార్‌ కార్డుకు మొబైల్‌లింక్‌, ఆధార్‌కార్డు హిస్టరీ, ఈకేవైసీ, కొత్త ఓటరు కార్డు కోసం మీ సేవ, నెట్‌ సెంటర్ల నిర్వాహకులు రూ.200 నుంచి రూ.500వరకు తీసుకుంటున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక వారు అడిగిన నగదును చెల్లించి సర్టిఫికెట్లను తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై పాలకొండ సబ్‌కలెక్టర్‌ పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ను వివరణ కోరగా. ‘రెవెన్యూ సిబ్బంది వసూళ్లపై నిజనిజాలు పరిశీలిస్తాం. మీసేవ, ఇంటర్నెట్‌ సెంటర్లపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తాం. సాంకేతిక సమస్యలను కూడా పరిశీలిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Sep 10 , 2026 | 11:01 PM