Share News

మూడు నెలలుగా తాగునీటి కష్టాలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:12 AM

వేపాడ గ్రామ ఎస్సీ కాలనీ వాసులను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి.

మూడు నెలలుగా తాగునీటి కష్టాలు

  • రోడ్డు విస్తరణ పనుల్లో పాడైన పైపులైన్లు

  • పట్టించుకోని పాలకులు, అధికారులు

  • ఇదీ వేపాడ ఎస్సీ కాలనీ పరిస్థితి

వేపాడ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): వేపాడ గ్రామ ఎస్సీ కాలనీ వాసులను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సోంపురం-ఆనందపురం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఎస్సీ కాలనీకి తాగునీరు తరలించే పైపులైన్లు పూర్తిగా పాడైపోయాయి. దీంతో కాలనీ వాసులకు తాగునీరు అందడం లేదు. మూడు నెలలుగా ఎస్సీ కాలనీకి తాగునీరు అందకపోయినా గ్రామస్థాయి అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవని ఎస్సీ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీకి తాగునీరు రాకపోవడంతో దబ్బిరాజుపేట రహదారిలో ఉన్న శానాపతివారి కల్లాల వద్ద గల ట్యాపు వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని ఎస్సీ కాలనీ మహిళలు వాపోతున్నారు. అక్కడ కూడా బురద నీరు వస్తోందని.. మంచినీటి కోసం గంటల తరబడి వేచిఉండాల్సి వస్తోందంటున్నారు. తమకు తాగునీరు అందించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించక తప్పదని ఎస్సీ మహిళలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికా రులు రహదారి పనుల్లో భాగంగా పాడైన పైపులైన్లు బాగు చేయించి వేపాడ ఎస్సీ కాలనీకి తాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 12:12 AM