Share News

తాగునీటికి తిప్పలే..

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:31 PM

ఏటా నిర్వహణ ఖర్చులే రూ.లక్షలు దాటుతున్నాయి కానీ రాజాం మునిసిపాల్టీలో తాగునీటి వ్యవస్థ మెరుగుపడడం లేదు. గడిచిన రెండేళ్లలో అరకోటి రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది.

తాగునీటికి తిప్పలే..
మంగళవారం సరఫరా చేసిన బురదనీరు

  • తాగునీటికి తిప్పలే

  • రూ.లక్షల వ్యయం.. అయినా దాహం

  • రాజాం తాగునీటి పథకానికి నిత్యం మరమ్మతులే

  • రెండేళ్లలో ఖర్చు రూ.50 లక్షలు

  • సుజలధారదీ అదే పరిస్థితి

  • రూ.42.84 లక్షలు ఖర్చుపెట్టినా నిష్ఫలం

  • 195 గ్రామాలకు అవస్థలు

రాజాం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఏటా నిర్వహణ ఖర్చులే రూ.లక్షలు దాటుతున్నాయి కానీ రాజాం మునిసిపాల్టీలో తాగునీటి వ్యవస్థ మెరుగుపడడం లేదు. గడిచిన రెండేళ్లలో అరకోటి రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఎప్పటికప్పుడు స్థానికులకు తిప్పలు తప్పడం లేదు. మున్సిపాలిటీలో నీటి సరఫరా కోసం 2024-25లో రూ.27.54 లక్షలు, 2025-26లో రూ.22.38 లక్షలు ఖర్చు చేశారు.

దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్లు, రక్షిత నీటి పథకాలతో రాజాం ప్రజలకు నిత్యం తాగునీటి సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. తరచూ పైపులైన్లు పగిలిపోతున్నాయి. 200ఎంఎం డయా పైపు ఎప్పటికప్పుడే పాడవుతోంది. మునిసిపాల్టీలో 20 వార్డులు ఉన్నాయి. దాదాపు 12 వేల గృహాలు ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 47,120 మంది జనాభా ఉన్నారు. 2021లో జనాభా లెక్కలు చేపట్టకపోవడంతో ఈ సంఖ్య 60 వేలకు చేరుకున్నట్టు అంచనా. పట్టణంలో శివారు కాలనీలు సైతం పెరిగాయి. అటు సారధి, కొత్తవలస, పొనుగూటివలస,కొండంపేట గ్రామాలు సైతం రాజాం మునిసిపాల్టీలో విలీనమయ్యాయి. కానీ తాగునీటి సరఫరా మాత్రం అరకొరగానే ఉంది.

195 గ్రామాలకు కష్టం..

చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, జి.సిగడాం మండలాల్లోని 195 గ్రామాలకు నీరందించే సుజలధారదీ అదే పరిస్థితి. గడిచిన రెండేళ్లలో రూ.42.84 లక్షలు దీనిపై ఖర్చుచేశారు. కానీ పూర్తిస్థాయిలో నీటిని అందించలేకపోతున్నారు. రేగిడి మండలం బొడ్డవలస వద్ద నాగావళి నదిలో మూడు మోటార్లతో నీటి పంపింగ్‌ చేస్తున్నారు. 24 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేశారు. రాజాం మండలం పెనుబాక మీదుగా అండర్‌ గ్రౌండ్‌లో తరలిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు పైపులైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి. లీకులతో తాగునీరు వృథా కావడంతో పాటు వ్యర్థాలు, మట్టి కలిసిపోతున్నాయి. దీనివల్ల తరచూ కుళాయిల ద్వారా బురద నీరు వస్తోంది.

తాగునీటి ఎద్దడి

పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. శివారు కాలనీలకు తాగునీరు అందడం లేదు. అధికారులు మాత్రం నీటి పన్నులు కట్టించుకుంటున్నారు. నీటి సరఫరాపై శ్రద్ధ చూపడం లేదు. ఈ వారం రోజుల్లో ఎక్కువగా తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. కలుషిత నీరు వస్తుండడంతో ప్రజలు నీటిని పట్టుకోకుండా వదిలేస్తున్నారు. - సురేష్‌కుమార్‌, వస్త్రపురికాలనీ, రాజాం మునిసిపాల్టీ

ఇబ్బందిగా ఉంది

పేరుకే పట్టణం. కానీ గ్రామానికంటే తీసికట్టుగా మారింది. ఎప్పుడో దశాబ్దం కిందట నాటి పైపులైన్లు కావడంతో లీకులకు గురవుతున్నాయి. చెత్త, వ్యర్థాలు చేరి నీరు బురదమయంగా మారుతోంది. బయట 20 లీటర్ల నీటిని రూ.30కు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

తవుడు, అమ్మవారు కాలనీ, రాజాం మునిసిపాల్టీ

ప్రత్యేక ప్రణాళిక

మునిసిపాల్టీలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. సంకిలి పంపుసెట్‌ వద్ద తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. మోటార్లు సైతం మొరాయిస్తున్నాయి. పైపులైన్లు పాడవుతున్నాయి. దీనివల్లే నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయి. ప్రత్యేకంగా దృష్టిసారించాం.

- వెంకటరామరాజు, ఏఈ, రాజాం

Updated Date - Jul 17 , 2026 | 08:47 AM