Share News

Struggle for Last Rites అంత్యక్రియలకు అవస్థలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:32 AM

Struggle for Last Rites తుంబలి పంచాయతీ పందులవానివలస గిరిజన గ్రామంలో ఎవరైనా మరణిస్తే కష్టమే.. అంత్యక్రియలకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మృతదేహాన్ని మోసుకుంటూ.. పొలాలు.. సాగునీటి కాలువను దాటి గ్రామానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి చేరుకోవాల్సి వస్తోంది.

Struggle for Last Rites  అంత్యక్రియలకు అవస్థలు
మృతదేహాన్ని మోసుకుంటూ పంట పొలాల మధ్య నుంచి వెళ్తున్న దృశ్యం

  • రహదారి సౌకర్యం లేక ఇక్కట్లు

  • దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య

  • ఆవేదనలో పందులవానివలస గిరిజనులు

జియ్యమ్మవలస, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): తుంబలి పంచాయతీ పందులవానివలస గిరిజన గ్రామంలో ఎవరైనా మరణిస్తే కష్టమే.. అంత్యక్రియలకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మృతదేహాన్ని మోసుకుంటూ.. పొలాలు.. సాగునీటి కాలువను దాటి గ్రామానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి చేరుకోవాల్సి వస్తోంది. శుక్రవారం ఆ పీవీటీజీ గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పందులవానివలసలో 40 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే పీవీటీజీ గ్రామమైనా ఇక్కడ ఏ సౌకర్యాల్లేవు. తాగునీరు, కాలువలు వంటి మౌలిక వసతులకు వారు నోచుకోవడం లేదు. కాగా గ్రామానికి చెందిన జీసీసీ రిటైర్డ్‌ ఉద్యోగి పి.గుంపస్వామి(70) గురువారం రాత్రి మరణించారు. శుక్ర వారం ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. మృతదేహాన్ని మోసుకుంటూ.. వట్టిగెడ్డ రిజర్వాయర్‌ కుడి ప్రధాన కాలువ పరిధిలో ఉధృతంగా ప్రవహించే ఒకటవ బ్రాంచ్‌ కాలువ దాటి ఆవలి వైపు పొలాల మధ్య గుండా వెళ్లి ఖననం చేశారు. కొన్ని దశాబ్దాలుగా తమకు ఈ కష్టాలు తప్పడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానానికి రహదారి సౌకర్యంలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:32 AM