Filariasis పైలేరియా నిర్మూలనకు పటిష్ఠ చర్యలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:47 PM
Strong Measures to Eliminate Filariasis జిల్లాలో పైలేరియా (బోదకాలు) వ్యాధి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం పెదపెంకి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
సీతానగరం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పైలేరియా (బోదకాలు) వ్యాధి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం పెదపెంకి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ తర్వాత గ్రామంలో పైలేరియా బాఽధితులను పరామర్శించి.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వ్యాధి తీవ్రత, వైద్య సేవలు, మందుల సరఫరా ఎలా ఉందో తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్థుల సమక్షంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రామంలో సీసీ రోడ్లు లేకపోవడం వల్ల వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు విజృంభిస్తున్నాయని, దీంతో ప్రజలు పైలేరియా బారిన పడుతున్నారని ఆయన తెలిపారు. తక్షణమే పెదపెంకిలో సీసీ రోడ్లు నిర్మాణంతో పాటు పారిశుధ్య మెరుగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం జరగాలని, ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని సూచించారు. ఇందుకోసం తక్షణమే సర్వే నిర్వహించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అవసర మైన చోట్ల నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. వర్షా కాలంలో ఇళ్లలోకి నీరు రాకుండా ఉండేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జోగింపేటలో ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల , జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీలకు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలిచ్చారు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని, ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగ కుండా చూడాలన్నారు. గదుల్లో లైట్లు, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలని, మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.