Share News

Development and Welfare అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:29 AM

Strong Focus on Development and Welfare అభివృద్ధి , ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శనివారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు పెద్దపీట వేశారు.

 Development and Welfare అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
తోట‌ప‌ల్లి ప్రాజెక్టు

  • తోటపల్లి ప్రాజెక్టుకు రూ.47.81 కోట్లు

  • విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు నిధుల కేటాయింపు

  • గిరిజన రైతులకు శతశాతం సబ్సిడీపై సాగు పరికరాలు

  • సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి

  • మన్యం వాసుల హర్షం

పార్వతీపురం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి , ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శనివారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు పెద్దపీట వేశారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలతో పాటు రహదారుల నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు గిరిజన రైతులను అన్నింటా ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లాలో సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేటాయింపులు ఇలా..

- గత ఏడాదిలానే ఈ సారి కూడా బడ్జెట్‌లో తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించారు. పెండింగ్‌ పనుల పూర్తికి రూ.47.81 కోట్లు మంజూరు చేయగా.. ఇందులో అత్యధికంగా రూ.30 కోట్లు కెనాల్‌ పనులకు కేటాయించారు. అదేవిధంగా ఎడ్వర్త్‌ పనులకు రూ.2 కోట్లు, భూ సేకరణకు రూ.6.75 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి 9.06 కోట్లు మంజూరు చేశారు.

- వెంగళరాయ సాగర్‌ (వీఆర్‌ఎస్‌) ప్రాజెక్టుకు రూ.1.02 కోట్లు కేటాయించారు. జంఝావతికి మాత్రం ఆశాజనంగా నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పరిధిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- రాష్ట్రంలో ఎస్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.9,190 కేటాయించగా.. జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో గిరిజనులకు ఎంతో మేలు జరగనుంది. అంతేకాకుండా పామాయిల్‌తో పాటు ఇతర పంటల సాగుకు 100శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించనున్నారు. 10 ఎకరాల లోపు ఉన్న గిరిజన రైతులకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు 55శాతం సబ్సిడీతో స్ర్పింక్లర్లు అందించనున్నారు.

- సవర తదితర వర్గాలకు చెందిన గిరిజనులకు మాతృభాషలో విద్యను బోధించేందుకు రూ.5 వేల గౌరవం వేతనంతో వాలంటీర్ల నియామకానికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.

- సీతంపేట, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలల్లో ఉపాధి కోర్సులు, భోదనకు అవసరమైన అదనపు భవనాల నిర్మాణం, నిర్వహణకు నిధులు కేటాయించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో తొమ్మిది, పార్వతీపురం ఐటీడీఏ పరిఽధిలో 12 బర్త్‌ వెయింటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు, అంబులెన్స్‌ల నిర్వహణకు బడ్జెట్‌లో నిధులు మంజూరు చేశారు. పార్వతీపురం, సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల పనుల వేగవంతానికి కూడా నిధులు కేటాయించారు.

- గుమ్మలక్ష్మీపురంలో దశాబ్దాలుగా మధ్యలో నిలిచిపోయిన ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన నాడు-నేడు పనులకు మోక్షం కల్పించనున్నారు.

- పురపాలక సంఘాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌(వీఈఆర్‌) పరిధిలో ఉన్న జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రస్తావించారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌, వ్యవసాయ పరికరాల తయారీ తదితర రంగాల్లో అవసరమైన సహకారాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

- జిల్లాకు ఒక సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. దీనివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది.

- గిరిజన గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు సైతం నిధులు కేటాయించారు.

- వీబీ జీ రామ్‌ జీ పథకానికి నిధులు మంజూరు చేస్తూనే.. 100 రోజుల నుంచి 120 రోజుల పని దినాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

- వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పశు వైద్య భవనాలకు రాష్ట్రంలో రూ.20 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాలో గూడు లేని పశువైద్య శాల లకు మోక్షం లభించే అవకాశం ఉంది. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు తదితర వాటిపై పన్ను భారం తగ్గించారు. పశుబీమా పథకం, సూక్ష్మ సేద్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

Updated Date - Feb 15 , 2026 | 12:29 AM