Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:36 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి, జేసీ సేతు మాధవన్‌

బొబ్బిలి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ సేతు మాధవన్‌తో కలిసి ప్రజల నుంచి 72 వినతులను స్వీకరించారు. 14 శాఖల పరిధిలో అందిన ఫిర్యాదుల్లో రెవెన్యూ, విద్యుత్‌ శాఖలవే అధికం. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన వినతులను ప్రభుత్వానికి నివేదించాలని, ఎక్కడా ఎటువంటి జాప్యానికి తావివ్వరాదన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఒక గ్రామం- ఒక నెల- నాలుగు సందర్శనలు చేపట్టిందన్నారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన రావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస పాణి, మున్సి పల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, పలు శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, హౌసింగ్‌, ఆర్‌అండ్‌బీ, ఆరోగ్య శాఖ తదితర అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగుడికి ఓదార్పు

బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసిన కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి ఓ దివ్యాంగుని గోడు విని చలించిపోయారు. అతడిని ఓదార్చి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన భీమసింగి సన్యాసిరావుకు వింత వ్యాధి సోకడంతో ఆరేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ప్రైవేట్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించే సన్యాసిరావుకు ఈ వింతవ్యాధి ప్రభావంగా రెండు కాళ్లూ చచ్చుబడి పోవడంతో అశక్తుడై పోయాడు. వైద్యం కోసం ఎన్నో ఆసుపత్రులకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. భర్తకు సపర్యలు చేసుకుంటూ ఇంటివద్దనే ఉండాల్సిన పరిస్ధితి సన్యాసిరావు భార్య సోములమ్మకు ఏర్పడింది. ఎటువంటి జీవనోపాధి లేక రోజువారీ జీవనం వారికి దుర్భరమైంది. వీరి దీనస్ధితిని గమనిం చిన గ్రామానికి చెందిన మరడ భాస్కర్‌ (రాజేశ్‌) మానవతతో స్పందించి వారికి నిత్యావసర సరుకులను ఆర్థిక సహాయాన్ని ఆరేళ్లుగా అందజేస్తున్నారు. విఫయం తెలుసుకున్న కలెక్టర్‌ ఆ దంపతులకు దగ్గరకు వెళ్లి సమస్యనుతెలుసుకున్నారు. ఓటరు, ఆధార్‌ , రేషన్‌ కార్డు, సొంతిల్లు, పెన్షన్‌ వంటివి ఏమీ లేవని తెలుసుకుని ఆశ్చర్య పోయారు. నెల రోజుల్లోగా అన్ని రకాల ధ్రుువపత్రాలను సన్యాసిరావుకు అంద జేయా లని ఎంపీడీవో, తహసీల్దార్‌లను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Jun 13 , 2026 | 12:36 AM