Share News

Striving for the comprehensive development of the district.జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:24 AM

Striving for the comprehensive development of the district. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా నడిపిస్తున్నామని, భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారనుందని ఎంఎస్‌ఎంఈ,సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Striving for the comprehensive development of the district.జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

ఎంఎస్‌ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి

ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారనుంది

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా నడిపిస్తున్నామని, భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారనుందని ఎంఎస్‌ఎంఈ,సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం జరిగిన 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్క రించాక సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తొలుత కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ వెంట రాగా ప్రత్యేక వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఎంఎస్‌ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు.

- వ్యవసాయ ఆధారిత జిల్లాలో 2026 ఖరీఫ్‌ సీజన్‌లో 3 లక్షల 5 ఎకరాల సాగు లక్ష్యం కాగా అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటివరకూ 58.189 మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచామని, 45,655 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని తెలిపారు.

- మత్స్య రంగంలో రానున్న ఐదేళ్లల్లో సగటున 20 శాతం వృద్ది సాధించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మత్స్యకారుల సేవలో భాగంగా 4,124 మంది మత్స్యకారులకు 8.24 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.

- జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పునాదులు పడుతున్నాయని, 11 భారీ, మెగా పరిశ్రమలను రూ.2.823.43 కోట్ల పెట్టుబడితో స్థాపించారని, ఇందులో 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. 8,314 సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలను రూ.511.63 కోట్ల పెట్టుబడితో స్థాపించి 32 వేల 565 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు.

- 2,200 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించామని, పూర్తిస్థాయి కార్యకలాపాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయని మంత్రి కొండపల్లి చెప్పారు.

- పీఎం సూర్యఘర్‌ పథకం కోసం జిల్లాలో 12,346 దరఖాస్తులు నమోదు అయ్యాయని, వాటిలో 9,285 యూనిట్లు సోలార్‌ గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయన్నారు. 7,668 మంది వినియోగదారులకు రూ.59.40 కోట్ల సబ్సిడీ విడుదలైందన్నారు.

- పర్యాటక అభివృద్ధి కోసం జిల్లాలో రూ.39 కోట్లతో నాలుగు పర్యాటక ప్రాజెక్టులు ప్రతిపాదించామన్నారు. తాటిపూడి, రామతీర్థం, చింతపల్లి బీచ్‌ వద్ద పర్యాటకుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించనున్నామన్నారు.

- పారిశుధ్యం కోసం ప్రస్తుతం 83 ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ల ద్వారా 42వేల 432 కిలోల వర్మీ కంపోస్టు అందుబాటులోకి వచ్చిందన్నారు. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో రోజుకు సగటున 121 మెట్రిక్‌ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి కాగా 115 మెట్రిక్‌ టన్నులను జిందాల్‌కు తరలిస్తున్నామన్నారు.

- మహిళా సాధికారిత లక్ష్యంగా జిల్లాలో అన్ని మండలాల్లో 40,194 స్వయం సహాయక సంఘాల్లో 4,35, 260 మంది మహిళలు సభ్యులుగా ఉండగా వీరిలో బ్యాంకు లింకేజీ ద్వారా 40,600 మందికి రూ 551.9కోట్లను, స్త్రీనిధి ద్వారా 17.002 మందికి రూ 166.92 కోట్లు అందించా మన్నారు. వీటితో పాటు మహిళల ఉచిత బస్సు ప్రయాణం, మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్‌, బీసీ సంక్షేమం, క్రీడలు, సీఎస్సాఆర్‌ ఫండ్స్‌, శాంతిభద్రతలకు సంబంధించిన పురోగతిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ, గాదె శ్రీనివాసులనాయుడు, డాక్టరు సురేష్‌బాబు, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, జేసీ సేతుమాధవన్‌, ఏఎస్‌పీ సౌమ్యలత, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, జిల్లా అధికార యంత్రాంగం, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు.

- స్టాల్స్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రారంభించారు. డీఆర్‌డీఏ, జిల్లా సర్వే, మత్య్స, పౌరసరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, పశు సంవర్ధక శాఖ, వ్యవసాయం, మెప్మా , గ్రామీణ నీటిపారుదల , జలవనరులు, ఐసీడీఎస్‌ , వైధ్య ఆర్యోగ్యశాఖ, పంచాయతీ, సచివాలయాలు, పరిశ్రమల శాఖలకు చెందిన స్టాల్స్‌ను గ్రౌండులో ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 16 , 2026 | 12:24 AM