గ్రామాల్లో సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:26 AM
గ్రామాల్లో సమస్యలు సృష్టిస్తే ఊపేక్షించేది లేదని, అలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
- ప్రజలంతా సమైక్యతతో మెలగాలి
-ఎస్పీ దామోదర్
- ఒకే రోజు 305 గ్రామాల్లో ‘మెగా పల్లె నిద్ర’
విజయనగరం/గరివిడి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సమస్యలు సృష్టిస్తే ఊపేక్షించేది లేదని, అలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. బుధవారం రాత్రి ఒకేసారి 305 గ్రామాల్లో మెగా పల్లె నిద్ర అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకూ సుమారు 1100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది భాగస్వాములయ్యారు. గరివిడి పోలీసు స్టేషన్ పరిధిలోని కాపుశంభం గ్రామంలో నిర్వహించిన ‘పల్లెనిద్ర’లో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండడం సహజమని, వాటిని శాంతియుతంగా, సామరస్యంగా పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని, పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారిని గుర్తించి, మంచి ప్రవర్తనతో వ్యవహరించేందుకు బైండోవర్ చేస్తామన్నారు. గ్రామాల్లో విభిన్న కులాలు, మతాలు ఉంటారని, ఎక్కువ, తక్కువ అనే వివక్షత వద్దన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తప్పవని అన్నారు. సైబర్ నేరాలపట్ల గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్లకు వచ్చే లింకులు క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు ఎవరికి షేర్ చేయవద్దని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా యువత బెట్టింగ్‌లు, జూదం, మద్యం, గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా సత్ప్రవర్తనతో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, చీపురుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.