Rural Economy గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:51 PM
Strengthening the Rural Economy is the Goal జిల్లాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆదాయాన్ని పెంచడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడమే ధ్యేయంగా డీఆర్‌డీఏ సరికొత్త ఆలోచనలు చేయాలన్నారు.
పార్వతీపురం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆదాయాన్ని పెంచడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడమే ధ్యేయంగా డీఆర్‌డీఏ సరికొత్త ఆలోచనలు చేయాలన్నారు. ప్రతి మం డలంలో మహిళా మార్ట్ , క్లస్టర్ వారీగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీకి వినూత్న డెలివరీ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సూచిం చారు. మండల స్థాయికి పరిమితమైన ఎఫ్‌పీవోలను మరింత విస్తరించాలన్నారు. ప్రతి మండ లంలో ఎంఎస్‌పీ కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానిక యువతను డెలివరీ బాయ్స్‌గా, కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి, ఐటీడీ ఏపీవో పి.మురళీధర్, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు పాల్గొన్నారు.
ఎంపీ లాడ్స్ పనులు పూర్తి కావాలి
సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఎంపీ లాడ్స్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులన్నింటినీ శనివారం నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్‌షెల్టర్లు, సామాజిక భవనాలు, రచ్చబండ వంటి పనులు పూర్తి చేయాలన్నారు. నిధులు ఉండి కూడా పనులు పూర్తికాకపోతే చర్యలు తప్ప వని హెచ్చరించారు. రోజువారి పనుల ఫొటోలను ఎంపీ లాడ్స్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
శతశాతం ఆధార్ నమోదు
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లల ఆధార్ నమోదు శతశాతం జరగాలని కలెక్టర్ ఆదేశిం చారు. ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ‘నెట్‌వర్క్ సమస్యలుంటే ఆయా గ్రామాల సమీపంలోని అనుకూల ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లి ఆధార్ నమోదు పూర్తి చేయాలి. ఇందుకు ఎంపీడీవో, వైద్యాధికారి సహకారం తీసుకోవాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించే సూపర్‌వైజర్లు, సిబ్బంది జీతాలు నిలిపేస్తాం. కేంద్రాల్లో శతశాతం పిల్లలు హాజరు ఉండాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, ఆధార్ సమన్వయకర్త రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.