గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 02 , 2026 | 12:19 AM
జిల్లాలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఒకపక్క పిడుగులు మోత..మరోపక్క వడగళ్ల వాన కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
- పలుచోట్ల పిడుగులు, వడగళ్లు
- నేల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
- అరటి, మామిడికి తీవ్ర నష్టం
- రెండు పాడి ఆవులు మృతి
విజయనగరం , మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఒకపక్క పిడుగులు మోత..మరోపక్క వడగళ్ల వాన కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈదురుగాలులకు గంట్యాడ మండలం లక్కిడాం, కొటారుబిల్లి కూడలి, భోనంగి గ్రామాల వద్ద విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పలుచోట్ల అరటి పంట నేలమట్టమయ్యింది. జామి, లక్కవరపుకోటలో మామిడి పంటకు నష్టం చేకూరింది. బొబ్బిలి చర్చి సెంటర్‌లో ఫ్లెక్సీలు, హోర్డింగులు నేలకొరిగాయి. పలువీధుల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. రాజాంలో సుమారు రెండు గంటల పాటు విడతలవారీగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. పట్టణంలోని పలువీధులు జలమయమయ్యాయి. మెయిన్‌రోడ్ మీదుగా మురుగునీరు ప్రవహించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబేడ్కర్ జంక్షన్ నుంచి డోలపేట, శ్రీకాకుళం రోడ్‌లోని సప్తగిరికాలనీ వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. సప్తగిరికాలనీ, మల్లికార్జున కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని గొల్లవీధి, చాకలివీఽధి, మెంటిపేట ఎస్సీకాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. రాజాంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేపాడ మండలంలో పిడుగులు పడ్డాయి. పిడుగు పాటుకు గురై సింగరాయి గ్రామంలో జామి ఈశ్వరరావుకు చెందిన ఆవు, కొత్త సింగరాయి గ్రామంలో గేదెల అప్పలనాయుడుకు చెందిన ఆవు మృతి చెందాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. విజయనగరంలోని కెఎల్ పురం మెయిన్‌రోడ్డు, రైల్వేస్టేషన్ వైఎస్సార్ జంక్షన్‌లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల రహదారులపై వర్షపు నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లోని పలు వార్డుల్లో వర్షపు నీరు కారింది. పది బెడ్ల ఐసీయూ, ఐసీసీయూలు జలమయమయ్యాయి. నీరు పడుతున్నచోట ఆసుపత్రి సిబ్బంది బకెట్లు పెట్టి చేతులు దులుపుకొన్నారు. ఒక్క ఐసీయూ మాత్రమే కాకుండా మిగత వార్డుల్లో దాదాపు పరిస్థితి ఇలాగే ఉందని రోగులు వాపోతున్నారు.