Share News

Stopping.. going ఆగుతూ.. సాగుతూ!

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:20 PM

Stopping.. going ఎస్‌.కోట చుట్టుపక్కల ప్రాంతీయులు విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు విమానం, రైలు, బస్సులకు టిక్కెట్లు రిజర్వేషన్‌లు చేసుకున్నప్పటికీ నష్టపోవాల్సి వస్తోంది. విశాఖకు సకాలంలో చేరలేక వాటిని అందుకోలేకపోతున్నారు.

Stopping.. going ఆగుతూ.. సాగుతూ!
ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

ఆగుతూ.. సాగుతూ!

ఎస్‌.కోట నుంచి విశాఖకు బస్సు ప్రయాణం 2 గంటలు

వాస్తవానికి గంటన్నరే.. అరగంట అధికంగా పడుతున్న వైనం

సమయపాలన తప్పడంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు

ఒక్కోసారి రైళ్లు అందుకోలేక తీవ్ర ఇబ్బందులు

ఎస్‌.కోట చుట్టుపక్కల ప్రాంతీయులు విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు విమానం, రైలు, బస్సులకు టిక్కెట్లు రిజర్వేషన్‌లు చేసుకున్నప్పటికీ నష్టపోవాల్సి వస్తోంది. విశాఖకు సకాలంలో చేరలేక వాటిని అందుకోలేకపోతున్నారు. బస్సు దిగి వాటిని చేరుకోనేలోపే కదిలిపోతున్నాయి. దీంతో సమయం, డబ్బు కోల్పోవాల్సి వస్తోంది. ఏఐ ఆధారిత సేవలను అందిపుచ్చుకుంటున్న ఈ ఆధునిక కాలంలో కూడా ఆర్టీసీ యాజమాన్యం పాత పద్ధతులనే అవలంభిస్తోంది. కండిషన్‌ లేని బస్సులను నడుపుతోంది. ఎస్‌.కోట డిపో నుంచి నడుస్తున్నవన్నీ దాదాపుగా కాలం చెల్లిన బస్సులే. ఎక్కడబడితే అక్కడ ఆగిపోతున్న ఘటనలకు కొదవ లేదు.

శృంగవరపుకోట, మార్చి 9(ఆంధ్రజ్యోతి):

ఎస్‌.కోట పట్టణానికి చెందిన వెంకటరమణ హైదరాబాద్‌ వెళ్లేందుకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నెల రోజులు ముందే రిజర్వేషన్‌ చేయించుకున్నాడు. సాయంత్రం ఐదు గంటలకు బయలు దేరే ఈ రైలును అందుకొనేందుకు గంటన్నర ముందు ఎస్‌.కోటలో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. తీరా ఆ బస్సు రైల్వే స్టేషన్‌కు చేరేటప్పటికి రెండు గంటల సమయం పట్టింది. బస్సు దిగి రైల్వేస్టేషన్‌కు వెళ్లేటప్పటికే రైలు కదిలిపోయింది. బస్సు ప్రయాణం అరగంట ఆలస్యం కావడంతో నెలరోజుల ముందు ట్రైన్‌ టిక్కెట్‌ పొందినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికప్పడు రిజర్వేషన్‌ టిక్కెట్‌ దొరికే అవకాశం లేక అధిక మెత్తంలో సొమ్ము చెల్లించి ప్రైవేటు ట్రావెల్‌ బస్సును ఆశ్రయించాడు. ఇది వెంకటరమణ పరిస్థితి మాత్రమే కాదు. శృంగవరపుకోట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుల సమయపాలనను నమ్ముకొని విశాఖ బయలుదేరిన వారందరి పరిస్థితి ఇంతే. ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. యాజమాన్యం ఇచ్చిన సమయపాలన సరిపోకపోవడంతో ప్రతి బస్సు అరగంట ఆలస్యంగా నడుస్తున్నాయి.

బస్సు ఆగిపోయిందంటే గంటే..

ఆర్టీసీ బస్సు ఎక్కడైనా ఆగిపోతే తరువాత ఈ డిపోకు చెందిన మరో బస్సు ఎక్కాలంటే కనీసం గంట సమయం పడుతుంది. దీంతో ప్రయాణికులు అనుకున్న సమయానికి గమ్యానికి చేరలేకపోతున్నారు. స్థోమత వున్న వ్యక్తులు అప్పటికప్పుడు ప్రైవేటు వాహనాలను సమకూర్చుకుంటున్నారు. అయితే ఆర్టీసీలో ప్రయాణించే వారంతా పేద, సామాన్య ప్రజలు కావడంతో మరో బస్సు ఏర్పాటు చేసేవరకు ఉండక తప్పడం లేదు. ఎక్కడా నిలిపేయకుండా బస్సు ప్రయాణం చేసినప్పటికీ యాజమాన్యం సూచించిన సమయానికి చేరుకోలేకపోతున్నాయి. సరాసరి అరగంట ఆలస్యంగా నడుస్తున్నాయి.

డ్రైవర్లు, కండక్టర్లకు విశ్రాంతి కరువు

ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు గంటా 30 నిమిషాలకు చేరుకొనేలా ఆర్టీసీ అధికారులు సమయం నిర్దేశించారు. ఈ రోడ్డులో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌, స్పీడ్‌ బ్రేకర్స్‌తో రెండు గంటల సమయం పైబడుతోంది. విశాఖ నుంచి అరకు పర్యాటక ప్రాంతానికి చెందిన రోడ్డు కావడంతో వివిధ రకాల వాహనాలతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. దీనికి తోడు పెందుర్తి వరకు సింగిల్‌ రోడ్డు. ఆర్టీసీ బస్సులు తప్ప మిగిలిన అన్ని వాహనాలు దాదాపుగా గంటకు వంద కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తున్నాయి. ఇక పెందూర్తి నుంచి నాలుగు వరసల రోడ్డు అయినా అడుగుకో స్పీడ్‌ బ్రేకర్స్‌ ఉన్నాయి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌కు కొదవ లేదు. ఇవన్నీ దాటుకొని విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు, అక్కడ నుంచి తిరిగి ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకొనేటప్పటికి చెరో రెండు గంటల చొప్పున నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రతి ట్రిప్పుకు గంట అలస్యం అవుతుండడంతో డ్రైవర్‌, కండక్టర్లకు విశ్రాంతి దొరకక ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు.

కిక్కిరిసి ప్రయాణం

స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత పరిస్థితి మరింత దిగజారింది. 60 మంది వరకు ప్రయాణించే బస్సుల్లో వందకు పైబడి ప్రయాణికులు ఉంటున్నారు. ఒక్కోస్టేజీలో ఐదు నుంచి పది మంది వరకు ఎక్కుతున్నారు. దీంతో బస్సులు కిక్కిరిస్తున్నాయి. గతంలో ఒక్కో స్టేజీలో ప్రయాణికులు వుండేవారు కాదు. బస్సు అలస్యంగా వస్తుందని తెలిస్తే ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించేవారు. ఇప్పుడు మహిళలకు ఆర్టీసీలో ప్రయాణం ఉచితం కావడంతో బస్సు వచ్చేవరకు నిరీక్షిస్తున్నారు. దీనివల్ల వారితో బయలుదేరే మగవారికి అవస్థలు తప్పడం లేదు. బస్సు నిండుగా వుందని ఆపకపోతే ఆర్టీసీకి ఫిర్యాదులు వెలుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ బస్సులు సమయపాలన పాటించేందుకు అడ్డంకిగా మారాయి.

ఫ ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి వయా ధర్మవరం, విజయనగరం రోడ్డులో ప్రయాణ సమయం చాలడం లేదని డ్రైవర్‌లు, కండక్టర్‌లు అంటున్నారు. ఈ దారిలో గంట సమయం ఇచ్చారు. కానీ గంటన్నర సమయం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్‌లు పలు మార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి. సోమవారం ప్రజారవాణా ఉద్యోగుల సంఘం మధ్యాహ్న భోజన విరామ సమయంలో చేపట్టిన నిరసనలో ప్రధానంగా ఈ డిమాండ్‌ను ఎస్‌.కోట డిపోకు చెందిన సంఘం సెక్రటరీ కొల్లి కొటేశ్వరరావు వ్యక్తపరిచారు.

Updated Date - Mar 09 , 2026 | 11:20 PM