Stones are piercing sir.. రాళ్లు గుచ్చుతున్నాయ్ సారూ..
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:01 AM
Stones are piercing sir..
రాళ్లు గుచ్చుతున్నాయ్ సారూ..
మా రహదారిని బాగుచేయండి
డిప్యూటీ సీఎం ఫొటోను మెడకు తగిలించుకుని విద్యార్థుల వేడుకోలు
ఐదేళ్లగా సాగుతున్న దబ్బగుంట- పల్లపు దుంగాడ రోడ్డు
‘రాయపాలెం, మునపురాయి, చప్పని గెడ్డ, విప్పమాను వలస, పల్లపు దుంగాడ కొండ శిఖర గ్రామాల్లో నివసించే గిరిజన పిల్లలం. కొండ దిగువన 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాపుసోంపురం ప్రభుత్వ పాఠశాలలో 15 మంది వరకు చదువుకుంటున్నాం. రోజూ నడిచి వెళ్లే మాకు ఈ రోడ్డును బాగు చేయండి. రాళ్లపిక్కలు పరిచి వదిలేయడంతో బూట్లు కిందభాగం నుంచి పాదాలకు రాళ్లు గుచ్చుకుంటున్నాయి. సరిగా నడవలేక జారిపోతూ గాయపడుతున్నాం. గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ రోడ్డుకోసం ఏమీ చేయలేకపోతున్నారు. మేమెవరికి చెప్పుకోవాలో తెలియక మీ ఫొటోను మెడకు తగిలించుకొని వేడుకుంటున్నాం’
- దబ్బగుంట-పల్లపు దుంగాడ రోడ్డులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను మెడకు తగిలించుకోని మంగళవారం గోడు వెళ్లబోసుకుంటున్న గిరిజన విద్యార్థులు.
శృంగవరపుకోట, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):
శృంగవరపుకోట మండలం దబ్బగుంట నుంచి పల్లపదుంగాడ వరకు 6.10 కిలోమీటర్లు పొడవున ఉన్న రోడ్డును ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నిఽధులు రూ.4.89 కోట్లతో 2021 జూన్ 21న పనులు చేపట్టారు. 2022 జూన్ 20 నాటికి రోడ్డు పని ముగించేలా అధికారులు నిర్దేశించారు. కానీ ఇంతవరకు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. ఐదేళ్లగా పనులు సాగుతుండడంతో కొండ శిఖర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు కాలినడక నిత్యకృత్యంగా మారింది. ఎవరికి సుస్తీ చేసినా డోలీ మోతే గతి.
శృంగవరపుకోట మండల పరిధిలో కొండ శిఖరాన దారపర్తి గిరిజన పంచాయతీ ఉండగా ఈ పంచాయతీ శివారున 12 గిరిజన గూడేలు ఉన్నాయి. వీరంతా మండల కేంద్రంతో పాటు పల్లపు ప్రాంతంలో వున్న ఏగ్రామానికి వెళ్లాలన్నా రానుపోను 25 కిలోమీటర్లు దూరం నడవాలి. రాళ్లు,రప్పలు, తుప్పలు దాటుకూంటు కొండ దిగి ఎక్కాలి. రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన అప్పటి, ప్రస్తుత శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఈ రోడ్డు నిర్మాణం కోసం అప్పటి, ఇప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నుంచి నిఽధులు కేటాయించారు. అయితే రోడ్డు నిర్మాణం చేపట్టే స్థలమంతా అటవీ శాఖ పరిధిలో వుంది. ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా, అప్పటి ఉమ్మడి విశాఖ పరిధిలో వున్న అనంతగిరి గిరిజన మండల పరిధిలో ఎక్కువగా ఈ స్థలం వుండడంతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అనేక అభ్యంతరాలు వచ్చాయి. రోడ్డుకు తీసుకుంటున్న భూమికి బదులు రెవెన్యూకు చెందిన భూమిని సామాజిక అడవుల పెంపకానికి ఇవ్వాలని అడిగారు. అంగీకరించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఆ బాధ్యత అప్పగించింది. అటవీశాఖకు భూమిని ఇచ్చేందుకు మండల పరిధిలోని పేదఖండేపల్లి గ్రామంలోని కొండను గుర్తించారు. అటవీశాఖకు అప్పిగించే పక్రియ పూర్తయ్యేలోపు 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారం చేపట్టిన రెండేళ్ల తరువాత రోడ్డు పనులు ప్రారంభించారు. 5.90 కిలోమీటర్లు తారు రోడ్డు, 0.20 కిలోమీటర్లు సిమెంటు రోడ్డు, 34 కల్వర్టులు నిర్మించేలా అధికారులు ప్రణాళిక తయారు చేశారు. కొండ ప్రాంతం కావడంతో ఏమాత్రం వర్షం పడిన రోడ్డుపైకి వరద నీరు వచ్చేస్తుండేది. నిర్మించిన రోడ్డుకూడా కొట్టుకుపోతుండేది. రోడ్డు నిర్మాణం కోసం వేసిన రాతి పిక్కలు పైకి వచ్చేస్తున్నాయి. ఎక్కడక్కకడ బీటలు వారిపోతోంది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఈ విధంగానే జరిగింది. గిరిజన విద్యార్థులు నడిచేందుకు వీలులేని విధంగా తయారైంది. దీంతో డిప్యూటీ సీఎం ఫొటో పట్టుకొని విన్నవించారు.
---------------