stock rain water in all places రా‘జాం’
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:29 PM
stock rain water in all places నాలుగు చినుకులు రాలితే చాలు రాజాం ప్రాంతీయులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా వాహన చోదకుల వెతలు వర్ణనాతీతం.. వివిధ పనుల మీద రాజాం వచ్చేవారంతా ఆ సమయంలో నరకం చూస్తున్నారు. రాజాంను వేగంగా దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
రా‘జాం’
చినుకురాలితే పట్టణంలో చింతే
ఎక్కడికక్కడ రోడ్డుపై నిలిచిపోతున్న మురుగునీరు
ఐదేళ్లుగా ఇదే దుస్థితి
బెంబేలెత్తుతున్న జనం
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలే ప్రధాన కారణం
నాలుగు చినుకులు రాలితే చాలు రాజాం ప్రాంతీయులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా వాహన చోదకుల వెతలు వర్ణనాతీతం.. వివిధ పనుల మీద రాజాం వచ్చేవారంతా ఆ సమయంలో నరకం చూస్తున్నారు. రాజాంను వేగంగా దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలోని వీధుల్లోకి వెళ్లేందుకు కూడా వీల్లేని దుస్థితి నెలకొంటోంది. మెయిన్‌రోడ్డుపై రెండడుగుల ఎత్తులో మురుగునీరు ప్రవహిస్తోంది. గడచిన నాలుగైదేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు గాని పాలకులు గాని పట్టించుకోకపోవడంపై ప్రజలు బహిరంగంగానే తిట్టిపోస్తున్నారు. మున్సిపల్ యంత్రాంగం పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రాజాం రూరల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):
రాజాంలో డ్రైనేజీ వ్యవస్థపై మున్సిపల్ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడింది. సమస్యను పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళిక ఉండడం లేదు. మురుగునీటి సమస్య తలెత్తగానే తాత్కాలిక చర్యలు చేపట్టి మమ అనిపిస్తున్నారు. ప్రధానంగా కాలువలు ఆక్రమణలకు గురికావడం, కాల్వపై నిర్మాణాలు చేపట్టడం, ఫుట్‌పాత్ కనిపించకుండా తాత్కాలిక, శాశ్వత దుకాణాల ఏర్పాటు, కాల్వలపై ఆధునిక వసతులతో కట్టడాలు చేపట్టడం చేస్తున్నారు. దీనివల్ల పారిశుధ్య కార్మికులు కాల్వలో పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించలేకపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా మురుగునీరంతా ఎక్కడికక్కడ మెయిన్‌రోడ్డుపై గంటల పాటు నిలిచిపోతోంది.
ఏయే ప్రాంతాలలో..
బొబ్బిలిరోడ్డులోని అమ్మవారికాలనీ, ఆదర్శనగర్ కాలనీ, టీచర్స్ కాలనీ, మెంటిపేట ఎస్సీ కాలనీ, రెల్లివీధి, మాదిగవీధి, చాకలివీధి, గొల్లవీధి, మల్లయ్యపేట తదితర ప్రాంతాలతో పాటు చీపురుపల్లి రోడ్‌లోని పలు వీధుల్లో కాల్వల్లోని మురుగునీరంతా మెయిన్‌కు అనుసంధానం చేసే కాలువలో వచ్చి చేరుతోంది. వీటికితోడు మెయిన్‌రోడ్‌ను ఆనుకుని ఉన్న మొండివీధి, సత్యన్నారాయణపురం, తెలగావీధి, కొండకవీధితో పాటు మాధవబజార్ ప్రాంతాల్లోని కాల్వల్లోని మురుగునీరంతా మెయిన్ డ్రెయిన్‌లో చేరుతోంది. సాధారణ రోజుల్లో సమస్య తీవ్రత లేకపోయినా వర్షం కురిస్తే కాల్వలన్నీ పొంగిపోయి ప్రధాన కాల్వ నిండిపోయి మెయిన్‌రోడ్‌పైకి వచ్చి చేరుతోంది. ఇలా చేరిన మురుగునీరు బొబ్బిలి జంక్షన్ నుంచి నాలుగురోడ్ల కూడలి మీదుగా సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు మెయిన్‌రోడ్ మీదుగా ప్రవహిస్తూ శ్రీకాకుళం రోడ్డులోని సప్తగిరికాలనీ వద్ద కొంత నిలిచిపోగా, అక్కడి నుంచి మరో అర కిలోమీటర్ మేర రోడ్డుపైనే ప్రవహిస్తూ ఇదే రోడ్‌లోని పెట్రోల్ బంక్ వరకూ రోడ్డుపైనే నిలిచిపోతోంది. ఫలితంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం కురిసేటప్పుడు మెయిన్‌రోడ్ మీదుగా నడక కూడా నరకంగానే మారుతోంది. వర్షం తగ్గిన తరువాత కొన్ని గంటల పాటు రోడ్డెక్కలేని దుస్థితిని ఆ ప్రాంతీయులు ఎదుర్కొంటున్నారు. సప్తగిరికాలనీతో పాటు మల్లిఖార్జున కాలనీలోని ఏడులైన్లలోనూ చినుకుపడితే చాలు ఇళ్లల్లోకి మురుగునీరు చేరుతోంది.
కాలనీలదీ అదే దుస్థితి
పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీలలో రోజుల తరబడి నీరు నిలిచిపోతోంది. ఈశ్వరనారాయణ కాలనీలోని ఆరులైన్లతో పాటు బాబానగర్ కాలనీలోని ఐదు లైన్లలోకి వర్షం కురిస్తే వెళ్లలేని దుస్థితి. ఆయా కాలనీలలో దశాబ్దం క్రితం ఇష్టారాజ్యంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం, కాల్వల నిర్మాణం జరగకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఎల్‌ఐసీ కార్యాలయం వెనుక ప్రాంతంతో పాటు సారధిరోడ్‌లో కూడా ఇదే పరిస్థితి. వాసవినగర్ వాసుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ప్రణాళికలేని నిర్మాణాలు కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు.
ప్రజలూ సహకరించాలి
రామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్, రాజాం
పారిశుధ్య నిర్వహణలో ప్రజలూ సహకరించాలి. కాల్వల్లో నిర్మాణాల చెత్తతో పాటు వ్యర్థాలను వేస్తున్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఇళ్లమెట్లు కడుతున్నారు. షాపులు ఏర్పాటు చేస్తున్నారు.. కాల్వల్లో పేరుకుపోయిన పూడికలు తీయడం పారిశుధ్య కార్మికులకు వీలు కావడం లేదు. మాధవబజార్, శ్రీనివాసరోడ్, బజార్ రోడ్ తదితర ప్రాంతాలలో వ్యాపారులు సైతం చెత్తను కాల్వల్లో వేస్తున్నారు. ఫలితంగా వర్షం కురిసే సమయంలో మురుగునీరు సజావుగా ముందుకు సాగే వీళ్లేక రోడ్డెక్కుతోంది. అవసరమైన చర్యలు తీసుకుంటాం.