Share News

Kurupam Gurukulam కురుపాం గురుకులంలో కలకలం

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:52 PM

Stir at Kurupam Gurukulam కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వైరల్‌ జ్వరాలు కలకలం రేపాయి. రెండు రోజుల్లోనే 110 మంది విద్యార్థినులు జ్వరం, తలనొప్పి, వాంతులు, జలుబు, దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 71 మందికి పైగా విద్యార్థినులు వైద్య సేవలు పొందుతున్నారు. వారిలో 30 మంది కోలుకుంటున్నారు. మరో 38 మంది బాలికలు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

 Kurupam Gurukulam కురుపాం గురుకులంలో కలకలం
వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న విద్యార్ధినులు

  • రెండు రోజుల్లోనే 110 మంది విద్యార్థినులకు అస్వస్థత

  • ప్రస్తుతం 71 మందికి పైగా వైద్య సేవలు..

  • వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

  • తాగునీరు, ఆహార నమూనాల సేకరణ

  • పరిస్థితిపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌

  • మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశం

కురుపాం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వైరల్‌ జ్వరాలు కలకలం రేపాయి. రెండు రోజుల్లోనే 110 మంది విద్యార్థినులు జ్వరం, తలనొప్పి, వాంతులు, జలుబు, దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 71 మందికి పైగా విద్యార్థినులు వైద్య సేవలు పొందుతున్నారు. వారిలో 30 మంది కోలుకుంటున్నారు. మరో 38 మంది బాలికలు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందిస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తంగా 516 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇటీవల తుఫాను అనంతరం ముగ్గురు విద్యార్థినులకు వైరల్‌ జ్వరాలు రావడంతో అధికారులు చికిత్స అందించారు. గురువారం ఒక్కసారిగా పలువురు అస్వస్థతకు గురికావడంతో మాదలింగి పీహెచ్‌సీ వైద్యాధికారి తనూజ పాఠశాలకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 44 మందిని మాదలింగి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన అనంతరం తిరిగి పాఠశాలకు పంపించారు. మరో నలుగురిని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. వారిలో ఒకరు డిశ్చార్చి అయిపోయారు. కాగా కొంతమంది కోలుకున్నప్పటికీ పాఠశాలలో మరికొందరికి మళ్లీ జ్వరాలు రావడంతో శుక్రవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి ఆధ్వర్యంలో జిల్లా వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించారు. గురువారం రాత్రి నుంచే వైద్య బృందాన్ని పాఠశాలలో అందుబాటులో ఉంచారు. మరో రెండు, మూడు రోజులపాటు వైద్యులు అక్కడే ఉంటాని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. విద్యార్థినులందరూ ఒకే గదిలో ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వైరల్‌ జ్వరాలు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో ఒక్కో గదిలో 20 మంది చొప్పున ఉండేలా బాలికలను వేర్వేరు గదులకు మార్చారు. మరోవైపు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తాగునీటి నమూనాలను సేకరించారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాఠశాలకు చేరుకుని ఆహార నమూనాలను కూడా సేకరించారు.

స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్‌, సంధ్యారాణి

బాలికలకు వైరల్‌ జ్వరాలపై సీఎం చంద్రబాబునాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. వెంటనే గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ‘కలెక్టర్‌తో పాటు జిల్లా వైద్యాధికారులతో మాట్లాడానని.. విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి.’ అని ఆదేశించినట్లు మంత్రి వారికి తెలిపారు.

పరామర్శించిన ప్రభుత్వ విప్‌

కురుపాం: కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జ్వరాలతో బాధపడు తున్న విద్యార్థినులను శుక్రవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పరామర్శించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. మీకు అండగా ఉంటామని చెప్పారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, పాఠశాల ప్రిన్సిపాల్‌ దాలమ్మ, ఏపీవో ప్రసాదరావుతో మాట్లాడి.. బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థినులు పూర్తిగా కోలుకునే వరకు వైద్యసేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ కూడా బాలికల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ కురుపాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు, పాఠశాలలో ఉన్న బాలికలను కూడా పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సందీప్‌, తల్లిదండ్రులతో మట్లాడారు.

పాఠశాల పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

కురుపాం పాఠశాలను పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ రహర్‌ పరిశీలించారు. వైద్యులు, ప్రిన్సిపాల్‌తో మాట్లాడి.. బాలికల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాలు, వాటర్‌ ప్లాంట్‌, వంటగది పరిశీలించారు. అదనపు భవనాల నిర్మాణం భవనం వెంటనే పూర్తి చేయాలని జేఈ రమేష్‌ను ఆదేశించారు.

మెరుగైన వైద్యసేవలు : కలెక్టర్‌

కురుపాం పాఠశాలలో జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, పరిస్థితి అదుపులో ఉందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు హాజరైన 516 మంది బాలికలకు ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న 71 మంది విద్యార్థినుల ఆరోగ్యం బాగానే ఉందన్నారు. పాఠశాలలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి.. ఒక్కో వార్డులో 15 నుంచి 20 మంది విద్యార్థులకు మాత్రమే వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్రెడ్‌, పాలు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం అందిస్తున్నారని, వైద్యుల సూచనలు మేరకు ప్రత్యేక మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఇద్దరు చిన్న పిల్లల వైద్య నిపుణులు, జనరల్‌ పిజీషియన్‌, ఇద్దరు వైద్యాధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఐటీడీఏ అధికారులు, ఇతర వైద్య సిబ్బంది విద్యారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. పాఠశాల ప్రాంగణంలో ప్రత్యే వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. పాఠశాలలోనే రెండు ఆర్‌వోలు ప్లాంట్లు ఉండగా, ఒకటి పాడైందని, బాలికలకు కాచి చల్లార్చిన నీటిని సరఫరా చేస్తున్నారని వివరించారు.

ఆశ్రమ స్కూళ్లలో ప్రత్యేక వైద్యశిబిరాలు

కురుపాం రూరల్‌, నవంబరు6(ఆంధ్రజ్యోతి): కురుపాం గురుకుల పాఠశాల ఘటనతో గిరిజన సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలత ముందస్తు చర్యల్లో భాగంగా శుక్ర వారం నీలకంఠాపురం, లంకోజోడు, ఉదయపురం గిరిజన సంక్షేమ బాలికల హైస్కూళ్లలో బాలిక లకు ప్రత్యేక వైద్య పరీక్షలు జరిపారు. లంకాజోడు ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులకు జ్వరం, తలనొప్పి ఉండడంతో వైద్య సేవలు అందించారు. ఆశ్రమ స్కూళ్లలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను బాగు చేశారు. వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

అంతదూరం ఎందుకు తీసుకెళ్లారు?

కురుపాం పాఠశాలకు కిలోమీటర్‌ దూరంలోనే కురుపాం సీహెచ్‌సీ ఉంది. అస్వస్థతకు గురైన విద్యార్థినులను అక్కడికి ఎందుకు తీసుకెళ్లలేదు. ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మాదలింగి ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారో అర్థం కావడం లేదు. పాఠశాలలోకి ఎవరినీ అనుమతించకపోవడం వెనుక కారణమేమిటో తెలియడం లేదు. ఇంతకి గురుకుల పాఠశాలలో ఏం జరుగుతోంది. గత ఏడాది జాండీస్‌తో ఇద్దరు బాలికలు మృతి చెందారు. పదులు సంఖ్యలో విద్యార్థినులు బాధపడ్డారు. సరైన ఆహారం, నీరు, వసతులు కలిపించకపోవడం వల్లే పాఠశాలలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. పాఠశాల సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలి. జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి.

- కూరంగి సీతారాం, జిల్లా ఉపాఽధ్యక్షుడు, ఆదివాసీ గిరిజన సంఘం

Updated Date - Nov 06 , 2026 | 11:52 PM