Share News

In-Charge Officials? ఇంకా ఇన్‌చార్జిలేనా?

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:03 AM

Still Running with In-Charge Officials? మన్యంలో దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లా ఆవిర్భావం నుంచి అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. కొన్నేళ్లుగా ఇన్‌చార్జి అధికారులతోనే నెట్టుకొస్తుండడంతో అభివృద్ధి కార్యక్రమాలు, పాలనపై ఆ ప్రభావం పడుతోంది. ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

 In-Charge Officials? ఇంకా ఇన్‌చార్జిలేనా?
పార్వతీపురం కలెక్టర్‌ కార్యాలయం

  • బదిలీలు, పదోన్నతులతో కీలక శాఖల్లో కుర్చీలన్నీ ఖాళీ

  • పోస్టుల భర్తీకి చర్యలు శూన్యం

  • నియామకమైన వారు జిల్లాకు రాని వైనం

  • ఒక్కో అధికారికి రెండు నుంచి నాలుగు శాఖల బాధ్యతలు

  • మన్యంలో దయనీయ పరిస్థితి

పార్వతీపురం, జూన్‌6(ఆంధ్రజ్యోతి): మన్యంలో దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లా ఆవిర్భావం నుంచి అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. కొన్నేళ్లుగా ఇన్‌చార్జి అధికారులతోనే నెట్టుకొస్తుండడంతో అభివృద్ధి కార్యక్రమాలు, పాలనపై ఆ ప్రభావం పడుతోంది. ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. జిల్లాలో ఏ శాఖకు పూర్తిస్థాయి అధికారి లేరు. కీలక శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటిని భర్తీ చేయడం లేదు. మరోవైపు బదిలీలు, పదోన్నోతులపై మన్యం నుంచి అధికారులు వెళ్లిపోతున్నా.. ఆయా స్థానాల్లో ఎవర్నీ నియమించడం లేదు. ఒకవేళ ఎవరైనా నియామకమైనా మన్యం జిల్లాకు వారు రావడం లేదు. దీంతో ఉంటే ఇన్‌చార్జిలు లేకుంటే కుర్చీలు ఖాళీ అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఒక్కో అధికారి రెండు నుంచి నాలుగు శాఖలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరించాల్సి వస్తోంది. మొత్తంగా మన్యం జిల్లా ఇన్‌చార్జి అధికారుల పాలనకు కేరాఫ్‌గా మారింది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. అధికారుల నియామకానికి చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం ఆర్డీవోగా నియామకమైన మాధురి ఇప్పటివరకు బాధ్యతలు స్వీకరించలేదు. జిల్లాలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన దిలీప్‌ చక్రవర్తిని విశాఖ ఆర్డీవోగా బదిలీ చేశారు. అయితే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. అనారోగ్యం కారణంగా మరో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ధర్మచంద్రారెడ్డి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ధర్మరాజును నియమించినా.. ఇంకా బాధ్యతలను స్వీకరించలేదు. జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డిని జిల్లా నుంచి బదిలీ చేసి రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ స్థానంలో ఎవర్నీ నియమించలేదు. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మన్మథరావు పదోన్నతిపై మన్యం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ పోస్టు సుమారు మూడేళ్లుగా ఖాళీగా ఉంది. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధికారి కృష్ణాజీ ఉద్యోగ విరమణ పొంది సుమారు ఏడాది గడుస్తుంది. ఆయన స్థానంలో పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. పంచాయతీరాజ్‌ జిల్లా ఇన్‌చార్జి ఇంజనీరింగ్‌ అధికారిగా సాలూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

-జిల్లా రెవెన్యూ శాఖాధికారి (డీఆర్వో) హేమలత.. మూడు కీలక శాఖలకు ఇన్‌చార్జి అధికారిగా ఉన్నారు. జాయింట్‌ కలెక్టర్‌, గృహ నిర్మాణశాఖ పీడీ, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా శాఖలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

-పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌.. సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా ఉన్నారు. అయితే పార్వతీపురం ఐటీడీఏ పీవో వైశాలి సెలవుపై వెళ్లడంతో ప్రస్తుతం ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పార్వతీపురం ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌గా కూడా నియ మించారు. మొత్తంగా రెండు ఐటీడీఏలతో పాటు రెండు సబ్‌కలెక్టర్‌ విధులను నిర్వర్తించాల్సి వస్తోంది.

Updated Date - Jun 07 , 2026 | 12:03 AM