Still Pending! ఇంకా జమకాలే!
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:21 AM
Still Pending! గత ఏడాది తుపాను, అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. దీంతో వారంతా పరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
గతేడాది తుపాన్, అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు మంజూరు కాని నష్టపరిహారం
పార్వతీపురం, జనవరి27(ఆంధ్రజ్యోతి): గత ఏడాది తుపాను, అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. దీంతో వారంతా పరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా గత ఏడాది అక్టోబరులో కురిసిన అధిక వర్షాలకు 383 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. 968 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అత్యధికంగా భామిని మండలంలో 173 మంది రైతులు, కొమరాడలో 139 మంది, పాచిపెంటలో 153 మంది రైతులు పంటలను కోల్పోయారు. వారికి సుమారు రూ.69 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఇక అదే నెలలో తుఫాన్ వల్ల 1128 మంది రైతులు 290 హెక్టార్లలో వరి పంటను నష్టపోయారు. అప్పట్లో సాలూరు మండలంలో 150 మంది రైతులు 48.37 హెక్టార్లలో, జియ్యమ్మవలసలో 135 మంది రైతులు 27.75 హెక్టార్లలో, భామినిలో 130 మంది 36.55 హెక్టార్లలో, గరుగుబిల్లిలో 155 మంది 28.93 హెక్టార్లలో అత్యధికంగా వరి పంటను కోల్పోయారు. వ్యవసాయధికారుల అంచనాల మేరకు వారందరికీ సుమారు రూ.70 లక్షల వరకు పరిహారంగా అందించాల్సి ఉంది. ఇక అధిక వర్షాల వల్ల జిల్లాలో 1059 మంది రైతులు అరటి పంటను నష్టపోయారు. వారికి సంబంధించి సుమారు రూ.కోటి 57 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా గత ఏడాది అధిక వర్షాలు, తుపాన్ల కారణంగా పంటలు దెబ్బతిన్న జిల్లా రైతులకు సుమారు రూ.మూడు కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ రూపంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ‘పంట నష్టపరిహారాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. త్వరలోనే రైతులు ఖాతాల్లోని ఇన్‌పుట్ సబ్సిడీ నగదు జమ అవుతుంది.’ అని జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు అన్నపూర్ణ, సత్యనారాయణరెడ్డి తెలిపారు.