Nutrition పోషకాహారానికి .. ఇంకా దూరమే
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:48 PM
Still Far from Adequate Nutrition సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవ సరం. సమతుల ఆహారంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత, వ్యాధులు దూరమవువుతాయి. అందుకే ప్రభుత్వం కూడా పౌష్టికాహార పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అయితే గిరిజన గ్రామాల్లో మాత్రం చాలామందికి సరైన పోషకాహారం అందడం లేదు. దీంతో రక్తహీనత తదితర వ్యాధులతో సతమతమవుతున్నారు.
వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల లేక నీరసిస్తున్న చిన్నారులు
గర్భిణులను వేధిస్తున్న రక్తహీనత
ప్రసవ సమయాల్లో ఇబ్బందులు
అవగాహన లేక.. మూఢనమ్మకాలతో అవస్థలు
నేటి నుంచి జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు
సీతంపేట, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవ సరం. సమతుల ఆహారంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత, వ్యాధులు దూరమవువుతాయి. అందుకే ప్రభుత్వం కూడా పౌష్టికాహార పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అయితే గిరిజన గ్రామాల్లో మాత్రం చాలామందికి సరైన పోషకాహారం అందడం లేదు. దీంతో రక్తహీనత తదితర వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా గిరిజన గర్భిణులు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తక్కువ బరువు, శారీరక ఎదుగుదల లోపంతో శిశువులు జన్మిస్తున్నారు. కొన్నిచోట్ల మాతా శిశు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే దీని లెక్క తేల్చేందుకు ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఐసీడీఎస్ శాఖ ప్రత్యేక సర్వే చేపట్టింది. వయసుకు తగ్గ ఎదుగుదల(ఎత్తు), బరువు లేని పిల్లలను గుర్తించారు. గిరిజన గర్భిణుల్లో నిరక్షరాస్యత, అమాయకత్వం, రక్తహీనత వంటి కారణాలతో బిడ్డలు తక్కువ బరువుతో పుడుతున్నారు. ప్రధానంగా గిరిజన మహిళలు గర్భిం దాల్చిన సమయం నుంచి ప్రసవం వరకు బలవర్ధకమైన ఆహారం తీసుకోకపోవడం, విశ్రాంతి లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి కొండపోడు వ్యవసాయ పనులు చేయడం, ఆహారపు అలవాట్లలో నెలకొన్న మార్పులు కారణంగా వారికి పుట్టే బిడ్డల్లో మధ్యస్థ తీవ్రమైన పోషకాహార లోపం(మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్)సమస్య ఉత్పన్నమవుతోంది. దీనిని అధిగమించేందుకు ఐసీడీఎస్ శాఖ ప్రత్యేక దృష్టిసారించడంలో విఫలమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి జాతీయ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా గిరిజన గ్రామాల్లో పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కేసులు ఇలా ..
గిరిజన గర్భిణిల్లో పౌష్టికాహార లోపం కారణంగా ఏజెన్సీలో వయసుకు తగ్గట్టు బరువు, ఎదుగుదల లేని పిల్లలు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సీతంపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 9సెక్టార్లలో మెయిన్ ,మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈఏడాది జూలైలో తీవ్రమైన పోషకాహార లోపంతో 119 మంది పిల్లలు, మధ్యస్థ పోషకాహార లోపంతో 367 వరకు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ఆగస్టు నెలలో మొత్తంగా 470 వరకు కేసులున్నట్లు తేల్చారు. ఈ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాల్సి ఉండగా ప్రతినెలా పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
వేధిస్తున్న రక్తహీనత సమస్య
గిరిజన మహిళలు, గర్భిణులు, కిశోర బాలికల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహారం తీసుకోవడంపై వీరికి పెద్దగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. రహదారి సౌకర్యాలు లేని గిరిశిఖర గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రా లకు సకాలంలో పౌష్టికాహారం సరఫరా కావడం లేదు. దీంతో గిరిజన గర్భిణులు పసవం అయ్యే వరకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోలేకపోతున్నారు. కొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు అందిస్తున్న పోర్టుఫైడ్ రైస్, పాలు, గుడ్లు, పప్పు తదితర సరుకులను కుటుంబ సభ్యులంతా తినేస్తున్నారు. దీనివల్ల గర్భిణులకు పూర్తిస్థాయిలో పోషకాలతో కూడిన ఆహారం అందక రక్తహీనతతో బాధపడుతున్నారు.
ఆహారపు అలవాట్లలో మార్పు
గిరిపుత్రులు ఒకప్పుడు రాగులు, గంటెలు, జొన్నలు, సోలు, సామలు, కొర్రలు వంటి పోషకాలతో కూడిన పంటలను పండించే వారు. వాటినే క్రమం తప్పకుండా తినేవారు. దీంతో ఆరోగ్యంగా ఉండేవారు. కాలక్రమంలో ఈ పంటలను గిరిపుత్రులు పండించడం తగ్గించేశారు. అధిక ఆదాయమార్గాల అన్వేషణలో భాగంగా సీజనల్ పంటలపై వీరు ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. చిరుధాన్యాలు తదితర పంటలు సాగు తగ్గించగా.. ఆహారపు అలవాట్లలో మార్పు వల్ల గిరిజనులు పౌష్టికాహారం లోపంతో సతమత మవు తున్నారు. రక్తహీనత, సికెల్‌సెల్ అనీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.
గిరిజనుల్లో మూఢనమ్మకాలు
ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో చాలామంది గిరిజనులు మూఢనమ్మకాలను విశ్వసి స్తుంటారు. గర్భిణులకు ప్రసవ సమయం సమీపిస్తున్నా.. యజ్జరోడు చెప్పిన ముహుర్తం మేరకే ఆసుపత్రులకు తీసుకెళ్తుంటారు. లేకుంటే ఇంటివద్దే మంత్రసానులతో ప్రసవం చేయిస్తుంటారు. చివరి క్షణంలో అంబులెన్స్‌ను ఆశ్రయించి ఆసుపత్రులకు పరుగులు పెట్టడం ఏజెన్సీలో సర్వసాధారణమైంది.
వెలవెలబోతున్న గర్భిణుల వసతిగృహం
మాతా,శిశు మరణాల నివారణే లక్ష్యంగా గిరిజన గర్భిణుల కోసం సీతంపేట వైటీసీలో 16 బెడ్లతో ఏర్పాటుచేసిన వసతిగృహం వెలవెలబోతోంది. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు గర్భిణులే ఉన్నారు. మిగిలిన బెడ్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ.. కొద్ది నెలలుగా వసతిగృహంలో రెగ్యులర్ వైద్యసిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. ఇక బరువు తక్కువ, ఇతరాత్ర సమస్యలతో అప్పుడే పుట్టిన బిడ్డలకు సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఎన్‌ఆర్‌సీ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నారు. తల్లులకు కూడా పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్నారు. పుట్టిన బిడ్డ కోలుకున్న తర్వాత తల్లీబిడ్డను ఎన్‌ఆర్‌సీ నుంచి తరువాత ఇంటికి పంపిస్తున్నారు.