Share News

Still bothered విలవిల్లాడుతూనే..

ABN , Publish Date - May 10 , 2026 | 12:29 AM

Still bothered భగభగ మండే ఎండల్లో శ్రమించే ఉపాధి కూలీలకు కాస్తంత భరోసా కూడా దక్కడం లేదు. తాగునీరిచ్చే నాథుడు లేడు. నీడ ఎలాగూ లేదు. వడదెబ్బ తగిలితే తక్షణం కాపాడేందుకు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు లేవు. దయనీయ పరిస్థితిలో పనులు చేస్తున్నారు.

Still bothered విలవిల్లాడుతూనే..
పురిటిపెంటలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు

విలవిల్లాడుతూనే..

ఉపాధి కూలీలకు కానరాని వసతులు

పని చేసే చోట నీడ, నీరు కరువు

కానరాని ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు

గజపతినగరం, మే9(ఆంధ్రజ్యోతి): భగభగ మండే ఎండల్లో శ్రమించే ఉపాధి కూలీలకు కాస్తంత భరోసా కూడా దక్కడం లేదు. తాగునీరిచ్చే నాథుడు లేడు. నీడ ఎలాగూ లేదు. వడదెబ్బ తగిలితే తక్షణం కాపాడేందుకు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు లేవు. దయనీయ పరిస్థితిలో పనులు చేస్తున్నారు.

ప్రతి రోజు ఉదయం 5-30 నుంచి 10గంటల వరకు మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు ఉపాధి కూలీలు పనులకు వెళ్తున్నారు. మండువేసవిలో ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఎండ వేడికి ఉపాధి కూలీలు చెమటలు కక్కుతున్నారు. కాసేపు సేద తీరుదామన్నా నీడ లేదు. సమీపంలో చెట్లు ఉంటే కొంత పరవాలేదు. లేకుంటే అంతే. ఎక్కడా వారు పనిచేసే చోట టెంట్‌లు గాని, మెడికల్‌ కిట్‌లు గాని అందుబాటులో లేవు. దీంతో కూలీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇంటివద్ద నుంచి ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో తీసుకువెళ్లిన నీరు ఎండ తీవ్రతకు వేడెక్కిపోవడంతో తాగలేని పరిస్థితి ఉందని కూలీలు వాపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో ఉండే హెల్తువెల్నస్‌ కేంద్రాల్లో మెడికల్‌ కిట్‌లు ఉన్నా కూలీలకు అందుబాటులో ఉంచడం లేదు. ఓఆర్‌ఎస్‌, ఐయోడిన్‌, పారాసెట్మాల్‌ మాత్రలు, దూది వంటివి సంబంధిత సబ్‌ సెంటర్‌ నుంచి తీసుకువెళ్లాలి. ఆ విధంగా క్షేత్రసహాయకులు చేయడంలేదు. పనులు చేపట్టిన చోట మౌలిక వసతులు లేవని గతనెలలో జరిగిన సోషల్‌ ఆడిట్‌లో అనేక గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాన్ని ఎస్సార్పీలే అధికారులకు వివరించారు. ఆ సమయంలో ఏపీడీ క్షేత్రసహాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మార్పు లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో 1546 చోట్ల పనులకు సంబంధించి 1, 84,970మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు.

వేసవి అలవెన్స్‌లు మాయం

ఉపాధి హామీ పథకంలో వేసవి కాలంలో పనిచేసే కూలీలకు గతంలో వేసవి అలవెన్స్‌లు ఉండేవి. మొత్తం కూలీకి వచ్చే వేతనంలో ఫిబ్రవరి నెలలో 20శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్‌ నెలలో 30శాతం అదనంగా అలవెన్స్‌లు ఇచ్చేవారు. అవాస ప్రాంతాలకు ఐదు కిలోమీటర్లు అవతల పనులు చేస్తుంటే కూలి మొత్తానికి 10శాతం ప్రయాణ అలవెన్స్‌లు ఇచ్చేవారు. ప్రస్తుతం అలవెన్స్‌లు లేకపోగా పనిచేసే దినాలకు బిల్లులు సక్రమంగా మంజూరు కావడంలేదు. ఇటీవల మూడునెలల బిల్లులు వచ్చినట్లు కూలీలు చెబుతున్నారు.

- గతంలో పనిచేసిన చోట ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచేవారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేసేవారు. ప్రస్తుతం కూలీలకు వడదెబ్బ తగిలినా.... గునపాం, పార కళ్లకు తగిలి గాయాలైనా ప్రథమ చికిత్స అందించే పరిస్థితి లేదు. పని ప్రాంతాల్లో విష పురుగులు కరిస్తే అంతే సంగతులు.

వసతులు కల్పిస్తున్నాం

పనిచేసే చోట మౌలిక వసతులతో పాటు ఫస్ట్‌ఎయిడ్‌ కిట్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక వసతులు కల్పించకుంటే క్షేత్ర సహాయకులపై చర్యలు తప్పవు. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల వేతనాలు కూలీల ఖాతాల్లో జమ చేశాం. వేసవి అలవెన్స్‌ల విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టిలో పెడతాం.

- కృష్ణవేణి, ఏపీవో, గజపతినగరం

Updated Date - May 10 , 2026 | 12:29 AM